ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ టైటిల్ విజేతగా నిలుస్తుందని అందరూ భావించారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ఒకటి టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉండటం అని చెప్పొచ్చు. ఐపీఎల్‌లో తన కెప్టెన్సీలోనే ఐదుసార్లు ముంబై ఇండియన్స్ జట్టుకు ట్రోఫీ అందించిన రోహిత్.. కచ్చితంగా ప్రపంచకప్ కూడా ఇంటికి తెస్తాడని అందరూ భావించారు. అటు ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లలోనూ రోహిత్ శర్మ కెప్టెన్సీకి మంచి మార్కులే పడ్డాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్ తిరుగులేని శక్తిగా ఫైనల్‌లో విజయం సాధిస్తుందని అటు ఫ్యాన్స్, ఇటు మాజీ క్రికెటర్ల సైతం అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇప్పటిదాకా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేదన్న విషయం విదితమే. ఇదే అంశంపై పలువురు దిగ్గజ ఆటగాళ్ల సైతం విరాట్‌పై విమర్శలు కురిపించారు. విరాట్ కెప్టెన్సీలో, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఓటమిపాలైంది. 2019 టీ20 ప్రపంచకప్‌లో కూడా సెమీ-ఫైనల్స్‌లో ఓడిపోయింది. అలాగే గతేడాది ఆడిన టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12లోనే ఇంటి దారి పట్టింది.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా తొలిసారి ప్రపంచకప్ ఆడుతోంది. ఈ ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా పటిష్ట ఆటతీరును ప్రదర్శించి గ్రూప్-బీ అగ్రస్థానంలో ఉండి.. సెమీఫైనల్ చేరింది. అయితేనేం.. అసలైన కీలక మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. గెలుపు ఓటములు అన్నవి గేమ్‌లో ఓ భాగం.. ఇది కాదు ఇప్పుడు ప్రశ్న. అసలు రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఏమైంది.? ఇది అందరి మదిలోని ప్రశ్న. ఈ ప్రపంచకప్‌లో అతడి కెప్టెన్సీని చూస్తే, అతని నిర్ణయాలు చాలా ప్రశ్నార్థకంగా ఉన్నాయి. అది జట్టు ఎంపిక విషయంలోనైనా.. మైదానంలో తీసుకున్న నిర్ణయాలు అయినా.. లేక తన బ్యాటింగ్ అయినా..
జట్టు ఎంపిక విషయంలో రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్లేయింగ్-11లో అతడు చేసిన ఎంపికలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మొదటి ప్రశ్న ఏంటంటే, యుజ్వేంద్ర చాహల్ లాంటి వికెట్ టేకర్‌కు రోహిత్ ఒక్క మ్యాచ్ కూడా తీసుకోకపోవడం.. సహజంగానే రవిచంద్రన్ అశ్విన్ సీనియర్ ప్లేయర్.. అయితే అతడి ఇటీవల ప్రదర్శన చూస్తే.. టీ20ల్లో అంతంతమాత్రంగా ఉంది. చాహల్ మాత్రం అలా కాదు. మిడిల్ ఓవర్లలో జట్టుకు కావాల్సిన కీలక వికెట్లు పడగొట్టగలడు. ఇదివరకు అలా చేసిన సందర్భాలు లేకపోలేదు. సెమీఫైనల్, అడిలైడ్‌లో చాహల్ కచ్చితంగా ప్రభావం చూపించగలడు. కానీ రోహిత్ శర్మ మాత్రం అతడిపై ఆసక్తి చూపించలేదు. ఇక మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు రెండు స్పిన్నర్లతో బరిలోకి దిగొద్దని టీమిండియాకు సూచించాడు. కానీ మన జట్టులో అక్షర్ పటేల్, అశ్విన్ ఇద్దరూ ప్లేయింగ్-11లో ఉన్నారు.
ఫినిషర్ స్థానంలో దినేష్ కార్తీక్‌ను ఎంపిక చేశారు సెలెక్టర్లు. దినేష్ కార్తీక్ ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఒక్క మ్యాచ్‌లోనూ అద్భుతాలు చేయలేకపోయాడు. జింబాబ్వేపై పంత్‌కు అవకాశం లభించింది. అందులో పంత్ విఫలమయ్యాడు. సెమీస్‌లో పంత్‌కి ఛాన్స్ ఇచ్చాడు. అక్కడా సరిగ్గా సద్వినియోగం చేయలేకపోయాడు. కార్తీక్‌కు మొదటి నాలుగు మ్యాచ్‌లలో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఇక జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వస్తుందని ఫ్యాన్స్ భావిస్తే.. రోహిత్ ఆ మ్యాచ్‌లో దినేష్‌ను తొలగించి పంత్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ఇలా మొత్తం అయోమయంగా రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కెప్టెన్ గురించి చెప్పాలంటే, అతడు తన ఆటతీరుతో ఆదర్శంగా నిలవడమే కాదు.. జట్టును ఉత్తేజపరుస్తుండాలి. అయితే ఇక్కడ కూడా రోహిత్ విఫలమయ్యాడు. ఈ ప్రపంచకప్‌లో అతడి బ్యాట్ నుంచి ఒకే ఒక్క అర్ధ సెంచరీ వచ్చింది. అది కూడా నెదర్లాండ్స్‌పై ఈ అర్ధశతకం సాధించాడు. సెమీఫైనల్‌లో రోహిత్ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం కూడా టీమిండియా ఓటమికి కారణమే.
రోహిత్ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఉన్నప్పుడు, అతడిలో మహేంద్ర సింగ్ ధోని కనిపిస్తున్నాడని చాలాసార్లు మాజీ ఆటగాళ్లు చెప్పారు. అంటే రోహిత్, ధోనీలాగే ఒత్తిడిని తట్టుకుని, కూల్ కెప్టెన్‌గా ఉన్నాడని వారి అభిప్రాయం. కానీ రోహిత్ కమాండ్ తీసుకున్నప్పటి నుంచి, ఒత్తిడి వచ్చినప్పుడల్లా నిరాశ చెందేవాడు. ఇదే విధంగా సెమీఫైనల్‌లో రోహిత్ ఒత్తిడిని తట్టుకోలేక సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు, దీంతో ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 169 పరుగుల లక్ష్యాన్ని సాధించింది.
కాగా, రోహిత్ జట్టు సారధ్య బాధ్యతలు స్వీకరించి.. కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే అయిందని.. కెప్టెన్‌గా అతడికి ఇది మొదటి ఐసీసీ టోర్నమెంట్. ఈ ఓటమి తర్వాత రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని చెప్పడం చాలా తొందరపాటు అని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతుండగా.. మరికొందరు ఇంకా కెప్టెన్‌గా రోహిత్ చాలా మెరుగవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు. గతంలోనూ విరాట్ కోహ్లీ తప్పిదాల నుంచి నేర్చుకుంటాడని.. అతడు విజయవంతమైన కెప్టెన్ అని అందరూ భావించారు. అయితే విరాట్ మాత్రం అర్ధాంతరంగా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అప్పట్లో బీసీసీఐ ఒత్తిడి వల్లే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్నాడని టాక్ కూడా నడిచింది. మరి రోహిత్ విషయంలో బీసీసీఐ ఏం చేస్తుందో వేచి చూడాలి.?