AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : హిట్ మ్యాన్‌కు కలిసిరాని లండన్ పిచ్.. లార్డ్స్ మైదానంలో రోహిత్ ఓవరాల్ రికార్డులు ఇవే

Rohit Sharma : లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడో వన్డేపై అందరి దృష్టి నెలకొంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఊహాగానాల మధ్య హిట్ మ్యాన్ లార్డ్స్‌లోని పేలవ రికార్డులను అధిగమించి భారత్‌కు సిరీస్ అందిస్తాడా? అతని కెరీర్‌లో ఈ మ్యాచ్ ఎంత ప్రత్యేకమో తెలుసుకుందాం.

Rohit Sharma : హిట్ మ్యాన్‌కు కలిసిరాని లండన్ పిచ్.. లార్డ్స్ మైదానంలో రోహిత్ ఓవరాల్ రికార్డులు ఇవే
Rohit Sharma
Rakesh
|

Updated on: Jul 18, 2026 | 11:16 AM

Share

Rohit Sharma : ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో భారత మాజీ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్ గురించిన చర్చ జోరందుకుంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 19న ఆదివారం ప్రసిద్ధ లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌లో చివరి మ్యాచ్ కాబోతోందంటూ క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2024లో టీ20 ఫార్మాట్‌కు, 2025లో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోహిత్.. ఈ మ్యాచ్ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే, లండన్ వేదికగా హిట్ మ్యాన్ సుదీర్ఘ అంతర్జాతీయ ప్రయాణానికి తెరపడనుంది.

హిట్ మ్యాన్‌కు కలిసిరాని లండన్ పిచ్

ఈ చారిత్రాత్మక మ్యాచ్‌ కంటే ముందు లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో రోహిత్ శర్మకు ఉన్న పాత రికార్డులను ఒకసారి పరిశీలిస్తే ఈ పిచ్‌పై అతనికి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. రోహిత్ ఇప్పటివరకు లార్డ్స్ మైదానంలో అన్ని ఫార్మాట్లు కలిపి మొత్తం 5 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 22.16 సగటుతో 133 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే టెస్ట్ క్రికెట్‌లో ఇక్కడ ఆడిన ఒక ఇన్నింగ్స్‌లో 83 పరుగులు సాధించాడు. ఇదే ఈ వేదికపై అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు. లార్డ్స్ గ్రౌండ్‌లో రోహిత్ ఖాతాలో ఒక అర్ధసెంచరీ ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు.

వన్డే ఫార్మాట్‌లో మరీ ఘోరం

ఇక వన్డే ఫార్మాట్ విషయానికి వస్తే లార్డ్స్ గ్రౌండ్‌లో రోహిత్ శర్మ గణాంకాలు మరీ బలహీనంగా ఉన్నాయి. ఇక్కడ ఆడిన 2 వన్డే మ్యాచ్‌ల్లో కేవలం 7.5 సగటుతో, 41.66 స్ట్రైక్ రేట్‌తో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నంబర్లను బట్టి చూస్తే 50 ఓవర్ల ఫార్మాట్‌లో లార్డ్స్ వేదికపై హిట్ మ్యాన్ పరుగులు చేయడానికి ఎంతగానో ఇబ్బంది పడ్డాడని స్పష్టమవుతోంది. క్రికెట్ మక్కాగా పిలవబడే ఈ మైదానంలో తన పాత పేలవ రికార్డును తిరగరాసి, లార్డ్స్‌లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాలని రోహిత్ అభిమానులు కోరుకుంటున్నారు.

కుటుంబ సమేతంగా లండన్‌కు పయనం

ఈ మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మకు మరికొన్ని కారణాల వల్ల కూడా చాలా ప్రత్యేకం కానుంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లతో కూడిన సరికొత్త జట్టును సిద్ధం చేయాలని భావిస్తున్న తరుణంలో ఈ మ్యాచ్ రోహిత్‌కు సవాల్‌గా మారింది. మరోవైపు, ఈ చారిత్రాత్మక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రోహిత్ శర్మ తన తల్లిదండ్రులను ప్రత్యేకంగా లండన్‌కు ఆహ్వానించినట్లు సమాచారం. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో ఈ సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో గెలిచి భారత్‌కు సిరీస్ అందించడంతో పాటు తన కెరీర్‌ను ఘనంగా ముగించాలని రోహిత్ పట్టుదలగా ఉన్నాడు.

2026లో హెచ్చుతగ్గుల ఫామ్

గత కొద్దికాలంగా వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మ ఫామ్ హెచ్చుతగ్గులతో సాగుతోంది. 2025లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 101 సగటుతో 202 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాపై కూడా 3 మ్యాచ్‌ల్లో 146 పరుగులు సాధించాడు. అయితే న్యూజిలాండ్ సిరీస్ నుంచి అతని ఫామ్ మందగించింది. కివీస్‌పై కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. ఇక 2026 సంవత్సరంలో అతని ప్రదర్శన పరిశీలిస్తే ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో 30 సగటుతో, 88.6 స్ట్రైక్ రేట్‌తో 241 పరుగులు మాత్రమే చేసి తన సాధారణ ప్రమాణాల కంటే వెనుకబడ్డాడు.

వన్డే చరిత్రలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాటర్‌గా రోహిత్ రికార్డులు

ప్రస్తుత ఫామ్ ఎలా ఉన్నప్పటికీ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన, గొప్ప బ్యాటర్లలో రోహిత్ శర్మ ఒకడనడంలో ఎలాంటి సందేహం లేదు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటివరకు 287 వన్డే మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 48.58 అద్భుతమైన సగటుతో, 92.76 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 11,757 పరుగులు సాధించాడు. ఇందులో 33 సెంచరీలు ఉన్నాయి. ఒకవేళ లార్డ్స్ వన్డేనే అతని చివరి మ్యాచ్ అయితే, చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో 7వ స్థానంలో నిలిచి గౌరవంగా కెరీర్‌ను ముగిస్తాడు. ఈ చివరి అవకాశాన్ని హిట్ మ్యాన్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us