Rohit Sharma : క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. రాబిన్ ఉతప్ప ఆల్‌టైమ్ ఇండియా వన్డే టీమ్‌లో హిట్ మ్యాన్‎కు దక్కని చోటు

Rohit Sharma : భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ప్రకటించిన ఆల్‌టైమ్ భారత వన్డే జట్టులో రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం సంచలనంగా మారింది. ఎంఎస్ ధోనీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, సచిన్, గంగూలీ, కోహ్లీ, యువరాజ్, కపిల్ దేవ్, బుమ్రా వంటి దిగ్గజాలకు చోటు కల్పించాడు.

Rohit Sharma : క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. రాబిన్ ఉతప్ప ఆల్‌టైమ్ ఇండియా వన్డే టీమ్‌లో హిట్ మ్యాన్‎కు దక్కని చోటు
Rohit Sharma

Updated on: Jul 16, 2026 | 3:13 PM

Rohit Sharma : భారత మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన This or That ఛాలెంజ్‌లో భాగంగా తన అభిమాన ఆల్‌టైమ్ భారత వన్డే జట్టును ఎంపిక చేశాడు. అయితే ఈ టీమ్‌లో రికార్డుల రారాజు రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. వన్డే క్రికెట్ చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా, భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా ఉన్న రోహిత్‌ను పక్కన పెట్టడం గమనార్హం. ఉతప్ప తన జట్టులో భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడి అయిన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు.

ఉతప్ప ఎంచుకున్న ఓపెనింగ్ కాంబినేషన్ చాలా బలంగా కనిపిస్తోంది. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన బ్యాటర్‌గా పేరొందిన సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. అతనికి జోడిగా ఇటీవల ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని ఉతప్ప ఎంపిక చేశాడు. గంగూలీ తన వన్డే కెరీర్‌లో 308 మ్యాచ్‌లలో 11,221 పరుగులు సాధించాడు. ఈ ఇద్దరు దిగ్గజాలు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే అని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.

మిడిలార్డర్ విషయానికి వస్తే, మూడో స్థానంలో రికార్డు స్థాయిలో 54 వన్డే సెంచరీలు చేసిన రన్ మెషిన్ విరాట్ కోహ్లీని ఉతప్ప ఎంచుకున్నాడు. నాలుగో స్థానంలో 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్‌కు చోటు కల్పించాడు. ఇక జట్టు వికెట్ కీపర్, కెప్టెన్‌గా మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీని నియమించాడు. ధోనీ కెప్టెన్సీలోనే భారత్ 2011 లో వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి ఆరో స్థానంలో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాను జట్టులోకి తీసుకున్నాడు. ఈ మిడిలార్డర్ కాంబినేషన్ ఎలాంటి మ్యాచ్‌నైనా గెలిపించగలదని ఉతప్ప నమ్మాడు.

ఆల్‌రౌండర్ విభాగంలో ప్రస్తుత స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా కంటే.. 1983 ప్రపంచకప్ గెలిచిన చారిత్రాత్మక కెప్టెన్ కపిల్ దేవ్‌ వైపే ఉతప్ప మొగ్గు చూపాడు. కపిల్ దేవ్ బ్యాటింగ్‌తో పాటు వేగవంతమైన బౌలింగ్‌తో జట్టుకు ఎంతో సమతుల్యతను ఇస్తాడని పేర్కొన్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాకు చోటు దక్కగా, ప్రధాన స్పిన్నర్‌గా భారత మాజీ లెజెండ్ అనిల్ కుంబ్లేను ఎంపిక చేశాడు. పేస్ బౌలింగ్ విభాగంలో స్వింగ్ కింగ్ జహీర్ ఖాన్, ప్రస్తుత యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాలకు బాధ్యతలు అప్పగించాడు. ఈ బౌలింగ్ లైనప్ ప్రపంచంలోని ఏ బ్యాటింగ్ శ్రేణినైనా కుప్పకూల్చగలదని ఉతప్ప ధీమా వ్యక్తం చేశాడు.

రాబిన్ ఉతప్ప ఆల్‌టైమ్ భారత వన్డే ప్లేయింగ్ ఎలెవన్ :

సచిన్ టెండూల్కర్ (ఓపెనర్)

సౌరవ్ గంగూలీ (ఓపెనర్)

విరాట్ కోహ్లీ (టాప్ ఆర్డర్ బ్యాటర్)

యువరాజ్ సింగ్( మిడిలార్డర్ బ్యాటర్)

ఎంఎస్ ధోనీ (కెప్టెన్ & వికెట్ కీపర్)

సురేష్ రైనా (బ్యాటర్)

కపిల్ దేవ్ (ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్)

రవీంద్ర జడేజా (స్పిన్ ఆల్‌రౌండర్)

అనిల్ కుంబ్లే (లెగ్ స్పిన్నర్)

జహీర్ ఖాన్ (ఫాస్ట్ బౌలర్)

జస్ప్రీత్ బుమ్రా (ఫాస్ట్ బౌలర్)

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us