
Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. మార్చి చివరి వారంలో మొదలైన ఈ క్రికెట్ పండుగలో ఇప్పటివరకు 73 మ్యాచ్‌లు ముగిశాయి. ఇక మిగిలింది కేవలం ఒకే ఒక్క మహా సంగ్రామం. ఈరోజు అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ జట్లు టైటిల్ కోసం నువ్వా-నేనా అంటూ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి ఈ ప్రతిష్టాత్మక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే టికెట్ల విక్రయాలు, ఇతర నిర్వహణ పరమైన ఇబ్బందులు తలెత్తడంతో చివరి నిమిషంలో ఈ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి మార్చారు. దీనిపై క్రికెట్ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, లక్షలాది మంది అభిమానుల మధ్య సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్ జట్టు రెచ్చిపోవాలని చూస్తోంది. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గుజరాత్ పై గెలిచి ఆర్సీబీ నేరుగా ఫైనల్ చేరగా, రెండో క్వాలిఫైయర్ లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ పగ తీర్చుకునేందుకు సిద్ధమైంది.
ఈ సీజన్ మధ్యలో పంజాబ్ కింగ్స్ జట్టు వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి 13 పాయింట్లతో తిరుగులేని స్థితిలో కనిపించింది. కానీ ఆ తర్వాత వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టింది. ఆ సమయంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కోచ్ రికీ పాంటింగ్ ఒక ఆసక్తికరమైన జోస్యం చెప్పారు. తన జట్టు రేసులో లేకపోయినా, ఈసారి ఫైనల్ చేరే సత్తా కేవలం ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్లకు మాత్రమే ఉందని ఆయన ముందే ప్రకటించారు. పాంటింగ్ ఊహించినట్టుగానే ఈ రెండు జట్లే ఈరోజు ఫైనల్ బరిలో నిలిచాయి.
ఈ మెగా ఫైనల్లో ఏ జట్టు గెలుస్తుందనే ప్రశ్నపై రికీ పాంటింగ్ సుదీర్ఘంగా విశ్లేషించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రెండు జట్లు సమానంగా బలంగా ఉన్నాయని, ఫైనల్ చేరిన రెండు జట్లకూ కప్పు గెలిచే అర్హత ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రెజర్ మ్యాచ్‌లలో ఒత్తిడిని అధిగమించి ఆ రోజు ఎవరు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారో వారికే విజయం దక్కుతుందన్నారు.
అయినప్పటికీ, ఆర్సీబీ జట్టుకు విజయం సాధించే అవకాశం మరో 5 శాతం అదనంగా ఉందని పాంటింగ్ స్పష్టం చేశారు. దానికి కారణం ఆర్సీబీ స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్.
“హేజిల్‌వుడ్‌కు అంతర్జాతీయ, లీగ్ మ్యాచ్‌ల ఫైనల్స్‌లో ఆడిన అపారమైన అనుభవం ఉంది. ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుని వికెట్లు తీయగల సమర్థుడు అతడు. అందుకే ఆర్సీబీకి టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.” అని పాంటింగ్ విశ్లేషించారు.
క్రికెట్ చరిత్రలో జోష్ హేజిల్‌వుడ్‌కు ఒక అద్భుతమైన రికార్డు ఉంది. బిగ్ బాష్ లీగ్, ఐపీఎల్, లేదా ఐసీసీ టోర్నమెంట్లు.. ఇలా హేజిల్‌వుడ్ ఇప్పటివరకు ఆడిన ఐదు ప్రధాన ఫైనల్ మ్యాచ్‌లలోనూ అతను ప్రాతినిధ్యం వహించిన జట్లే టైటిల్స్ గెలుచుకున్నాయి. ఫైనల్స్ లో ఆడి ఇప్పటివరకు ఓడిపోని రికార్డు అతనికుంది. గత సీజన్‌లో కూడా ఆర్సీబీని విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన హేజిల్‌వుడ్, ఈసారి కూడా జట్టుకు లక్కీ ప్లేయర్‌గా మారి ట్రోఫీని అందిస్తాడని బెంగళూరు యాజమాన్యం, అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..