Regina: 13 బంతుల్లో బ్యాట్‌తో విధ్వంసం.. ఆపై 7 బంతుల్లో 4 వికెట్లు.. కట్ చేస్తే.. అంతా ఫసక్!

|

Feb 21, 2023 | 9:06 PM

క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసినా.. చేసే ఆటగాడికి ఒత్తిడి ఉండటం తప్పనిసరి..

Regina: 13 బంతుల్లో బ్యాట్‌తో విధ్వంసం.. ఆపై 7 బంతుల్లో 4 వికెట్లు.. కట్ చేస్తే.. అంతా ఫసక్!
Cricket
Follow us on

క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసినా.. చేసే ఆటగాడికి ఒత్తిడి ఉండటం తప్పనిసరి. ప్రతి ప్లేయర్ తన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరచాలని భావిస్తాడు. ఈ క్రమంలోనే 17 ఏళ్ల రెజీనా సుధాజయ్‌కి అద్భుతమైన అరంగేట్రం దక్కింది. ఈ వర్ధమాన ఇటాలియన్ క్రికెటర్ యూరప్‌లో జరుగుతున్న టీ10 క్రికెట్ టోర్నమెంట్‌లో అరంగేట్రం చేసి తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టింది.

ఫిబ్రవరి 20న ఇటలీ, జిబ్రాల్టర్ మహిళల మధ్య జరిగిన టీ10 మ్యాచ్‌లో రెజీనా అరంగేట్రం చేసింది. ఈ మ్యాచ్‌లో ఇటలీకి చెందిన 17 ఏళ్ల క్రీడాకారిణి రెజీనా బ్యాట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది, ఆపై బౌలింగ్‌లోనూ హ్యాట్రిక్ సాధించింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ 10 ఓవర్లలో 136 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ రెజీనా 13 బంతుల తుఫాను ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయింది. ఈ అరంగేట్రం బ్యాటర్ 13 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో అజేయంగా 28 పరుగులు చేసింది.

హ్యాట్రిక్‌తో పాటు 7 బంతుల్లో 4 వికెట్లు..

ఇక ఇటలీ ఇచ్చిన 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జిబ్రాల్టర్ జట్టును 17 ఏళ్ల రెజీనా బంతితో విధ్వంసం సృష్టించింది. ఫలితంగా కేవలం 1.1 ఓవర్లు అంటే 7 బంతుల్లోనే 4 వికెట్లు పడగొట్టింది. అది కూడా 1 పరుగు మాత్రమే సమర్పించింది. పైగా ఆ నాలుగు వికెట్లలో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. కాగా, రెజీనా పదునైన బౌలింగ్ దెబ్బకు జిబ్రాల్టర్ జట్టు కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయింది. కట్ చేస్తే.. ఇటాలియన్ జట్టు 109 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.