Cricket Records : టీ20 వరల్డ్ కప్‌లో 463 పరుగులు.. ఫిన్ అలెన్–టిమ్ సైఫర్ట్ ప్రపంచ రికార్డు బద్దలు

Cricket Records : టీ20 వరల్డ్ కప్ 2026లో న్యూజిలాండ్ జట్టు సంచలనం సృష్టించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రక విజయంలో కివీస్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ పోషించిన పాత్ర అద్వితీయం.

Cricket Records : టీ20 వరల్డ్ కప్‌లో 463 పరుగులు.. ఫిన్ అలెన్–టిమ్ సైఫర్ట్ ప్రపంచ రికార్డు బద్దలు
Finn Allen Seifert Guide

Updated on: Mar 05, 2026 | 9:38 AM

Cricket Records : టీ20 వరల్డ్ కప్ 2026లో న్యూజిలాండ్ జట్టు సంచలనం సృష్టించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రక విజయంలో కివీస్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ పోషించిన పాత్ర అద్వితీయం. కేవలం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్, ఈ జోడీ ధాటికి కేవలం 12.5 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేసింది. అంటే ఇంకా 43 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సౌతాఫ్రికా గుండె పగిలేలా చేసింది.

ఈ మ్యాచ్‌లో ఫిన్ అలెన్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అతడికి తోడుగా టిమ్ సీఫెర్ట్ కూడా 33 బంతుల్లో 58 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు కేవలం 10 ఓవర్లలోనే 117 పరుగులు జోడించి సౌతాఫ్రికా బౌలర్లను ఆత్మరక్షణలో పడేశారు. ఈ ఇద్దరి విధ్వంసకర బ్యాటింగ్ వల్లే న్యూజిలాండ్ రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది.

కేవలం ఈ మ్యాచ్‌లోనే కాదు, ఈ టోర్నీ మొత్తంలో ఈ ఓపెనింగ్ జోడీ రికార్డుల వేట కొనసాగించింది. ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన జోడీగా ఫిన్ అలెన్ – సీఫెర్ట్ చరిత్ర సృష్టించారు. వీరిద్దరూ కలిసి ఈ టోర్నీలో ఇప్పటివరకు 463 పరుగులు జోడించారు. తద్వారా 2024లో అఫ్గానిస్థాన్ ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ – ఇబ్రహీం జద్రాన్ నెలకొల్పిన 446 పరుగుల రికార్డును తుడిచిపెట్టేశారు. ప్రస్తుతం ఫిన్ అలెన్ 289 పరుగులతో, సీఫెర్ట్ 274 పరుగులతో టోర్నీలో టాప్ స్కోరర్లుగా కొనసాగుతున్నారు.

న్యూజిలాండ్ ఇప్పుడు ప్రపంచ విజేతగా నిలిచేందుకు కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ పోరులో భారత్ లేదా ఇంగ్లాండ్‌తో కివీస్ తలపడనుంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఒక మ్యాచ్‌లో అజేయంగా 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ, ఫైనల్‌లోనూ అదే ఊపును కొనసాగిస్తే కివీస్ తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడటం ఖాయంగా కనిపిస్తోంది. మోడ్రన్ టీ20 క్రికెట్‌లో ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ ఎంత బలమైందో ఈ జోడీ నిరూపిస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us