Ranji Trophy 2022: రంజీట్రోపి 2022 సవరించిన షెడ్యూల్‌ని బీసీసీఐ ప్రకటించింది. లీగ్ దశ ఫిబ్రవరి 16 నుంచి మార్చి 5 వరకు జరుగుతుంది. దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల కారణంగా BCCI ఈ అగ్ర దేశీయ పోటీని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జనవరి 13 నుంచి ఆడాల్సి ఉంది. కానీ కరోనా వల్ల వాయిదా పడింది. అయితే ఇటీవల రీ షెడ్యూల్‌ని ప్రకటిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. అనుకున్నవిధంగానే లీగ్ దశని ప్రకటించారు.
రంజీ ట్రోఫీలో మొత్తం 38 జట్లు పాల్గొంటాయి ఈ మ్యాచ్‌లు 8 నగరాల్లో నిర్వహించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం రంజీ మ్యాచ్‌లు అహ్మదాబాద్, కోల్‌కతా, త్రివేండ్రం, కటక్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, రాజ్‌కోట్‌లలో జరుగుతాయి. అలాగే రంజీ ట్రోఫీ ఫార్మాట్‌ను బీసీసీఐ మార్చినట్లు తెలిసింది. నాలుగు జట్లతో కూడిన ఎనిమిది గ్రూపులను కలిగి ఉంటుంది. అందులో ప్లేట్ గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. మార్చి 2020లో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్ తర్వాత భారతదేశంలో రెడ్ బాల్ ఫార్మాట్‌లో జాతీయ స్థాయి దేశీయ మ్యాచ్ ఏదీ ఆడలేదు.
గత సీజన్‌లో రంజీ ట్రోఫీ రద్దు కావడంతో పరిహారం పొందిన దేశవాళీ క్రికెటర్లు.. టోర్నీని రెండు దశల్లో నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ జే షా గతంలో ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ సారైనా సవ్యంగా జరుగుతుందో లేదో అనుమానంగానే ఉంది. ఎందుకంటే దేశంలో కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ ఎక్కువవుతుండటంలో టోర్నీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక్క ఆటగాడికి కరోనా వచ్చినా ఆ ప్రభావం టోర్నీ మొత్తంపై పడుతుంది. కానీ కరోనా నివారణకు బీసీసీఐ పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది.