RR vs RCB Qualifier 2, IPL 2022: ఐపీఎల్ 2022 రెండో క్వాలిఫయర్‌లో భాగంగా ఈ రోజు ( శుక్రవారం) రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అలాగే గెలిచిన జట్టు ఫైనల్ చేరుకుంటుంది. అందుకే ఈ మ్యాచ్ ఇరు జట్లకి చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు జట్టును ముందుండి నడిపించాలనుకుంటున్నారు. శాంసన్, డు ప్లెసిస్ ఇద్దరూ బ్యాట్‌తో బాగా రాణించి జట్టుకు విజయాన్ని అందించాలని కోరుకుంటున్నారు. అయితే సంజు శాంసన్‌కి ఇది కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే ఈ RCB బౌలర్‌పై అతని రికార్డు చాలా చెడ్డగా ఉంది. ఐపీఎల్ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా చాలా దారుణంగా ఉంది. శాంసన్ తరచుగా వానిందు హసరంగా స్పిన్ మాయాజాలానికి చిక్కొకొని బలవుతున్నాడు.
ఈ శ్రీలంక లెగ్ స్పిన్నర్ ముందు సంజూ శాంసన్ రికార్డు చాలా దారుణంగా ఉంది. ఈ సీజన్‌లో హస్రంగ.. శాంసన్‌ని రెండుసార్లు ఔట్ చేశాడు. అలాగే ఐపీఎల్‌లోనే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా హసరంగా.. శాంసన్‌ను 3 సార్లు అవుట్ చేశాడు. ఈ ఇద్దరు ఆటగాళ్ళు 6 ఇన్నింగ్స్‌లలో ముఖాముఖిగా తలపడగా ఐదు సార్లు శాంసన్.. హసరంగ బౌలింగ్‌కి బలయ్యాడు. శాంసన్ కేవలం 3.60 సగటుతో 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ గణాంకాలు అతడిని భయపెడుతున్నాయి.
నిజానికి శాంసన్ ఎప్పుడూ స్పిన్నర్లపై భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తాడు. హసరంగాపై కూడా అలాగే ఆడటానికి ప్రయత్నించాడు. కానీ హసరంగ తన బంతులపై గొప్ప నియంత్రణను కలిగి ఉంటాడు. అతను గూగ్లీ, లెగ్ స్పిన్ అద్భుతమైన మిక్స్ చేసి బౌలింగ్ చేస్తాడు. అందుకే అతడి బౌలింగ్‌ని అంచనా వేయడం కష్టమైన పని. ఐపీఎల్ 2022లో అతను విజయాన్ని సాధించడానికి ఇదే కారణం. పర్పుల్ క్యాప్ రేసులో వనేందు హసరంగా, యుజ్వేంద్ర చాహల్ మధ్య పోరు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. యుజ్వేంద్ర చాహల్ 15 మ్యాచ్‌లు ఆడి 26 వికెట్లు తీశాడు. హసరంగ 15 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ ద్వారా పర్పుల్ క్యాప్ ఎవరు గెలుస్తారో కూడా తేలిపోతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.