RR, IPL 2026: సీజన్ మధ్యలోనే మారనున్న రాజస్థాన్ రాయల్స్ ఓనర్.. భారీ డీల్‌ చూస్తే పరేషానే..?

Rajasthan Royals Sale: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన ఒప్పందం నమోదైంది. ప్రముఖ ఉక్కు దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్ కుటుంబం, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా కలిసి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని రికార్డు స్థాయి ధర గైకొన్నారు. సుమారు రూ. 15,660 కోట్లతో జరిగిన ఈ భారీ డీల్ క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది.

RR, IPL 2026: సీజన్ మధ్యలోనే మారనున్న రాజస్థాన్ రాయల్స్ ఓనర్.. భారీ డీల్‌ చూస్తే పరేషానే..?
Rajasthan Royals

Updated on: May 03, 2026 | 8:27 PM

Rajasthan Royals Sale: భారత ప్రీమియర్ లీగ్ (IPL)లో యాజమాన్య మార్పులు ఊపందుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్రయం జరిగిన కొద్ది నెలలకే, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ వంతు వచ్చింది. స్టీల్ దిగ్గజాలు మిట్టల్ కుటుంబం, బిలియనీర్ అదర్ పూనావాలా సంయుక్తంగా ఈ జట్టును సుమారు 1.85 బిలియన్ డాలర్ల (రూ. 15,660 కోట్లు) భారీ ధరకు సొంతం చేసుకున్నారు. గతంలో అమెరికాకు చెందిన సంస్థ ఈ జట్టును కొనుగోలు చేస్తుందని వచ్చిన వార్తలకు ఈ ఒప్పందంతో తెరపడింది.

వాటాల వివరాలు, ఒప్పందం..

ఈ కొనుగోలు ఒప్పందం ప్రకారం, 2026 మూడవ త్రైమాసికం నాటికి ప్రక్రియ పూర్తవుతుంది. ఇందులో మిట్టల్ కుటుంబానికి అత్యధికంగా 75 శాతం వాటా ఉండగా, అదర్ పూనావాలా 18 శాతం వాటాను కలిగి ఉంటారు. మిగిలిన 7 శాతం వాటాను ప్రస్తుత యజమాని మనోజ్ బదాలే, ఇతర ఇన్వెస్టర్లు అంటిపెట్టుకుని ఉంటారు. కేవలం ఐపీఎల్ జట్టు మాత్రమే కాకుండా, దక్షిణాఫ్రికాలోని ‘పార్ల్ రాయల్స్’, కరేబియన్ లీగ్‌లోని ‘బార్బడోస్ రాయల్స్’ కూడా ఇప్పుడు వీరి పరిధిలోకి రానున్నాయి.

రాజస్థాన్‌తో మిట్టల్ కుటుంబానికి ఉన్న అనుబంధం..

లక్ష్మీ ఎన్. మిట్టల్ రాజస్థాన్‌లోని సాదుల్‌పూర్ గ్రామంలో జన్మించారు. తన సొంత రాష్ట్రానికి చెందిన జట్టును కొనుగోలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. “నాకు క్రికెట్ అంటే ప్రాణం, మా కుటుంబం రాజస్థాన్ నుంచే వచ్చింది. అందుకే నాకు అత్యంత ఇష్టమైన రాజస్థాన్ రాయల్స్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది,” అని ఆయన పేర్కొన్నారు. ఆదిత్య మిట్టల్, వనీషా మిట్టల్ కూడా బోర్డులో చేరనున్నారు, వీరు జట్టు వారసత్వాన్ని, యువ ప్రతిభను ప్రోత్సహించే దిశగా అడుగులు వేయనున్నారు.

అదర్ పూనావాలా, మనోజ్ బదాలే స్పందన..

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా మాట్లాడుతూ, ఆదిత్య మిట్టల్‌తో కలిసి ఈ పెట్టుబడి పెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జట్టు దీర్ఘకాలిక విజయాలకు తమ వంతు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. 2008 నుంచి జట్టుకు వెన్నెముకగా ఉన్న మనోజ్ బదాలే, ఈ కొత్త యజమానులను సాదరంగా ఆహ్వానించారు. వారు జట్టును మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుత సీజన్‌లో రాయల్స్ జోరు..

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ మెరుపులతో జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 12 పాయింట్లతో ప్లే ఆఫ్ రేసులో ఉన్న రాయల్స్, టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్ కంటే కేవలం ఒక పాయింట్ వెనుక ఉంది. యాజమాన్య మార్పుతో జట్టుకు మరింత నూతనోత్తేజం లభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us