8 ఏళ్లకే ఘోర ప్రమాదం.. కోలుకుని ప్రపంచకప్‌లో భారత్‌ను గెలిపించాడు.. కట్‌చేస్తే.. దీనస్థితిలో కుటుంబం.. ఆ క్రికెటర్ ఎవరంటే?
Team India: పంజాబ్ జట్టుకు చెందిన ఏకైక ఆటగాడిగా పేరుగాంచాడు. తజిందర్ సింగ్ భారతదేశం కోసం ప్రపంచ కప్ ఆడాడు. అయినప్పటికీ అతనికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదు.
Blind Cricket World Cup: భారతదేశంలో ఇతర ఆటల కంటే క్రికెట్‌పైనే ఆసక్తి ఎక్కువ. క్రికెటర్లను దేవుడిలా పూజిస్తుంటారు. వారికి ఎంతో గౌరవం ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, కొందరు క్రికెటర్లు మాత్రం వీటికి దూరంగానే ఉండిపోతుంటారు. కానీ, ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం గర్వించేలా చేస్తున్నారు. అలాంటి వారిలో కొందరు ఉన్నారు. ఇలాంటి వారి గురించి ఎవరికీ తెలియదు. ప్రభుత్వం కూడా అలాంటి ఆటగాళ్లకు సహాయం చేయడంలో విఫలమవుతూనే ఉంది. ప్రస్తుతం ఇలాంటి వారు చాలా కష్టాలతో జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన ఓ ఆటగాడే జలంధర్‌కు చెందిన అంధ క్రికెటర్ తజిందర్ పాల్ సింగ్.
అంధుల క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు చెందిన ఏకైక ఆటగాడిగా పేరుగాంచాడు. తజిందర్ సింగ్ భారతదేశం కోసం ప్రపంచ కప్ ఆడాడు. అయినప్పటికీ అతనికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదు. 2014లో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తజిందర్ రెండు వికెట్లు తీసి భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు.
నరేంద్ర మోడీని కలిసిన తజిందర్ పాల్ సింగ్..
ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన ఈ క్రికెటర్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశాడు. ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లందరికీ కేంద్ర ప్రభుత్వం నగదు బహుమతులు అందజేసింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చే విషయంపై తజిందర్ పాల్ మాట్లాడుతూ.. ‘ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో మంచి స్థానాల్లో ఉద్యోగాలు ఇచ్చాయని, పంజాబ్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదని’ వాపోయారు.
8 ఏళ్ల వయసులో కంటి చూపు కోల్పోయిన తజిందర్..
ఓ ప్రమాదం కారణంగా కళ్ళు పోగొట్టుకున్నప్పుడు తజిందర్ పాల్ సింగ్ వయసు కేవలం 8 సంవత్సరాలే. కానీ, క్రికెట్ ఆడాలనే అభిరుచితో అడుగులు ముందుకు వేశాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. తన ప్రయత్నాలను వదల్లేదు. దీంతో డెహ్రాడూన్‌కు వెళ్లి అక్కడ బ్లైండ్ క్రికెట్ ఆడటం నేర్చుకున్నాడు. ఇది సాధారణ క్రికెట్ లాగా ఉంటుందని, అయితే అండర్ ఆర్మ్ బౌలింగ్ జరుగుతుందని, 3 కేటగిరీల ఆటగాళ్లు ఉంటారని ఆయన చెప్పుకొచ్చాడు. రెగ్యులర్ క్రికెట్ రూల్స్ గురించి మాట్లాడితే, అంధుల క్రికెట్ అంతర్జాతీయ క్రికెట్‌కు కొద్దిగా భిన్నంగా ఉంటుంది.
పంజాబ్ ప్రభుత్వం నుంచి సహాయం కోసం విజ్ఞప్తి..
తన ఇంటి పరిస్థితి గురించి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని, ఫైలుతో ప్రభుత్వం వద్దకు వెళ్లినప్పుడల్లా ఏదో ఒక సాకుతో వెనక్కి పంపేశారన్నారు. ప్రస్తుతం కూలీ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నట్లు తెలిపాడు. ‘నాతో ఆడిన ఇతర రాష్ట్రాల ఆటగాళ్లు కూడా ఉన్నారు. వారి ప్రభుత్వాలు వారికి ఉద్యోగాలు లేదా డబ్బు ఇచ్చాయి. దీంతో వారు తమ జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు. కానీ, పంజాబ్ ప్రభుత్వం అలా చేయలేదు. ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందించలేదని’ వాపోయాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..