IPL 2022: ప్లేఆఫ్ రేసులో అత్యంత ముఖ్యమైన మ్యాచ్ పంజాబ్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ (PBKS vs DC) మధ్య జరిగింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ సీజన్‌లో 64వ మ్యాచ్ ఇది. పంజాబ్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఢిల్లీ.. పంజాబ్ కింగ్స్‌ను 17 పరుగుల తేడాతో ఓడించి ఈ సీజన్‌లో తమ ఏడవ విజయాన్ని నమోదు చేసింది. కుల్దీప్ యాదవ్ , అక్షర్ పటేల్ స్పిన్ దాడి, శార్దూల్ ఠాకూర్ మీడియం పేస్ బౌలింగ్‌తో పంజాబ్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాయి. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఐపీఎల్ 2022లో ఢిల్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ఇదే తొలిసారి.
పంజాబ్ బౌలింగ్ లో రాణించి ఢిల్లీని తక్కువ స్కోర్ కే పరిమితం చేసింది. అయితే పంజాబ్ బ్యాటింగ్‌లో మాత్రం ఘోరంగా నిరాశపరిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చివరి మ్యాచ్‌లో 210 పరుగులు చేసిన పంజాబ్ బ్యాట్స్‌మెన్.. ఈ మ్యాచ్ లో విఫలం అయ్యారు. వరుస వికెట్లు కోల్పోతూ ఎక్కువ స్కోర్ చేయలేకపోయారు. పవర్‌ప్లే చివరి ఓవర్‌లో అంటే ఆరో ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్.. శిఖర్ ధావన్, భానుకా రాజపక్సేలను అవుట్ చేశాడు. మూడు బంతుల తర్వాత కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (0)ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. ఎనిమిదో ఓవర్‌లో పంజాబ్‌కు అతిపెద్ద దెబ్బ తగిలింది. లియామ్ లివింగ్‌స్టన్.. కుల్దీప్ యాదవ్ వేసిన బాలింగ్ లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు కానీ దొరికిపోయాడు. ఇక్కడి నుంచి పంజాబ్ ఆశలు నీరుగారిపోయాయి. జితేష్ శర్మ చివర్లో రాణించాడు. రాహుల్ చాహర్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నాడు. అయితే 18వ ఓవర్‌లో శార్దూల్ మళ్లీ జితేష్‌తో సహా రెండు వికెట్లు తీశాడు. శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు తీయగా.. అక్షర్, కుల్దీప్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్ కూడా తమ సత్తా చాటలేక 20 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (63 పరుగులు), సర్ఫరాజ్ ఖాన్ (32 పరుగులు)రాణించారు. మొత్తంగా ఢిల్లీ 159 పరుగులు చేసింది.