పృథ్వీ షా క్రికెట్ కెరీర్‌లో మరో దెబ్బ తగిలింది, IPL 2025 మెగా వేలంలో అమ్ముడుపోకుండా పోవడం అతని ఆశలపై గట్టి దెబ్బగా మారింది. అతని మునుపటి ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ ద్వారా విడుదలైన అనంతరం, వేలంలో ఎవరు అతన్న దక్కించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం అతని భవిష్యత్తును మరింత అనిశ్చితంగా మార్చింది. యువ భారత ఓపెనర్‌గా ఎంతో ప్రతిభ కలిగి ఉన్నప్పటికి ఫిట్‌నెస్ సమస్యలు, వివాదాలు, అస్థిర ఫామ్ అతని విలువను తగ్గించాయి.
ఐపీఎల్ వేలానికి పృథ్వీ షా రూ.75 లక్షల బేస్ ధరతో ప్రవేశించినప్పటికీ, ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా అతనిపై ఆసక్తి చూపలేదు. ఒకప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున విశేష ప్రతిభ కనబరిచి ప్రశంసలు పొందిన షా, ఆ తర్వాత వివాదాలతో, క్రమశిక్షణ లేమితో తన స్థానాన్ని కోల్పోయాడు. ముంబై రంజీ ట్రోఫీ జట్టు నుంచి కూడా అతన్ని తొలగించడం, అతని ప్రస్తుత పరిస్థితికి ప్రతీకగా నిలిచింది.
ఫిట్‌నెస్ సమస్యలు మాత్రమే కాదు, మైదానంలో షా ప్రవర్తన కూడా క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. రికీ పాంటింగ్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలో, ఫామ్ లేమితో ఉన్న షా నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడానికి నిరాకరించిన సంఘటనను గుర్తుచేశారు. ఈ అతనిపై ప్రశ్నలు లేవనెత్తింది.
IPL 2025 వేలంలో విక్రయించబడని ఆటగాళ్లలో శార్దూల్ ఠాకూర్, అజింక్య రహానేలు కూడా ఉండగా, న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి ఆటగాళ్లు కూడా అమ్ముడుపోలేదు. వాషింగ్టన్ సుందర్ రూ.3.20 కోట్లకు గుజరాత్ టైటాన్స్‌కి అమ్ముడవ్వగా, ఫాఫ్ డు ప్లెసిస్ రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరారు.
పృథ్వీ షా తన కెరీర్‌ను పునరుద్ధరించడానికి ఇంకా ప్రయత్నించాలని ఈ పరిణామం సూచిస్తోంది. అతని ప్రతిభకు సందేహం లేదు, కానీ ఫిట్‌నెస్, క్రమశిక్షణ సమస్యలను అధిగమించకుండా, అతను క్రికెట్‌లో తన స్థానాన్ని తిరిగి పొందడం సవాలుగా మారింది. IPL వేలంలో అమ్ముడుపోకపోవడం అతనికి ఓ అవమానం కావచ్చు, కానీ ఇది అతనికి ఒక గుణపాఠంగా మారి తన ఆటపై మరింత శ్రద్ధ పెట్టేలా ప్రేరేపించవచ్చు.
కాగా ఒకప్పుడు పృథ్వీషా తన టాలెంట్ తో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. సచిన్, సెహ్వాగ్, లారా కలిస్తే ఎలా ఆడతారో షా ఒక్కడే అలా అడతాడని మన్ననలు పొందాడు. అలాంటి ప్లేయర్ ఈ రోజు ఐపీఎల్ లో కనీస ధరకు కూడా అమ్ముడు కాకపోవడానికి క్రమశిక్షన లేకపోవడమే కారణమని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.