IND vs ENG: ‘ఆ సెంచరీ పొరపాటున వచ్చిందే.. ఆయన సామర్థ్యం వల్ల కాదు’.. పంత్‌పై పైత్యం చూపిన పాక్ క్రికెటర్..

|

Jul 03, 2022 | 11:56 AM

Rishabh Pant: ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రిషబ్ పంత్ 111 బంతుల్లో 20 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 146 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

IND vs ENG: ఆ సెంచరీ పొరపాటున వచ్చిందే.. ఆయన సామర్థ్యం వల్ల కాదు.. పంత్‌పై పైత్యం చూపిన పాక్ క్రికెటర్..
Rishabh Pant
Follow us on

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ అద్భుత సెంచరీ సాధించాడు. 98 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను, రవీంద్ర జడేజాతో కలిసి పంత్ భారీ ఇన్నింగ్స్‌తో చక్కదిద్దాడు. 111 బంతుల్లో 146 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన పంత్.. జడేజాతో కలిసి 200 పరుగులకు పైగా భాగస్వామ్యం నిర్మించి, ప్రశంసలు అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత పంత్‌పై ప్రపంచం నలుమూలల నుంచి క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఒక మాజీ పాకిస్థాన్ క్రికెటర్ మాత్రం తన పైత్యాన్ని చూపించి, నెట్టింట నవ్వులపాలవుతున్నాడు. పంత్ సెంచరీని మెచ్చుకునే బదులు ఇంగ్లండ్ బౌలర్ల తప్పిదమంటూ కామెంట్స్ చేస్తున్నాడు. దీంతో నెటిజన్లు ఓ రేంజ్‌లో దుమ్మెత్తిపోస్తున్నారు.

స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలి నిషేధానికి గురైన మహ్మద్ ఆసిఫ్ సోషల్ మీడియాలో పంత్ టెక్నిక్‌పై ప్రశ్నలు లేవనెత్తాడు. ఇంగ్లండ్ బౌలర్లు పరుగులు సమర్పించుకోవడం, వారి తప్పిదం వల్లేనని, ఈ క్రమంలోనే పంత్ సెంచరీ సాధించాడని విమర్శించాడు. పంత్ తన సత్తాతో సెంచరీ చేయలేదంటూ తన పైత్యం చూపించాడు. అలాగే విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై కూడా ఆసిఫ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అతని టెక్నిక్ బాగుండవచ్చు. అతను నా కంటే పెద్ద ఆటగాడు కావచ్చు. కానీ, కోహ్లీ పరుగులు చేయాల్సిందే, దాదాపు మూడేళ్లుగా అతను సెంచరీ చేయలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

పంత్ సామర్థ్యంపై ప్రశ్నలు..

ఈ వీడియోలో మహ్మద్ ఆసిఫ్ రిషబ్ పంత్ బ్యాటింగ్‌పై స్టేట్‌మెంట్ ఇచ్చాడు. పంత్ సామర్థ్యాన్ని ప్రశ్నించాడు. ఇంగ్లండ్ బలహీనమైన వ్యూహం, పేలవమైన బౌలింగ్‌ను పంత్ సద్వినియోగం చేసుకొని సెంచరీ సాధించాడు, అతని సామర్థ్యం వల్ల కాదంటూ కామెంట్ చేశాడు. పంత్ టెక్నిక్‌ను ప్రశ్నిస్తూ, ‘అతను షాట్ ఆడుతున్నప్పుడు పై చేయి మాత్రమే ఉపయోగిస్తాడు. లోయర్ హ్యాండ్‌ను ప్రత్యేకంగా ఉపయోగించుకోడు’ అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్ వ్యూహాంపై మాట్లాడుతూ, ‘పంత్, జడేజా ఇద్దరూ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా ఉన్నారు. జాక్ లీచ్‌ని బౌలింగ్‌లోకి తీసుకురావడం ఆ సమయంలో అతిపెద్ద తప్పు. లీచ్ ఒత్తిడిలో ఉన్నందున బ్యాట్స్‌మెన్ దానిని సద్వినియోగం చేసుకున్నారు. ఇది కాకుండా, ఇంగ్లండ్ బౌలర్లు ఎక్కువగా బంతిని ముందుకు వేయలేదు. షార్ట్ ఆఫ్ లెంగ్త్ బంతులు వేశారంటూ విమర్శలు చేశాడు.

 

బర్మింగ్‌హామ్‌లో బలంగా భారత్..

మ్యాచ్ ప్రారంభ సెషన్‌లో భారత జట్టు స్కోరు 98 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ బౌలర్లు ఊహించినట్లుగానే విధ్వంసం సృష్టించడంతో భారత టాప్ ఆర్డర్ కుప్పకూలింది. దీని తర్వాత రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఆరో వికెట్‌కు 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, భారత ఇన్నింగ్స్‌ను కైవసం చేసుకున్నారు. పంత్ 146 పరుగుల వద్ద అవుట్ కాగా, జడేజా కూడా 104 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్లో షమీ 16, కెప్టెన్ బుమ్రా అజేయంగా 31 పరుగులతో భారత్ 416 పరుగులు చేసింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. బుమ్రా 3, షమీ, సిరాజ్ తలో వికెట్ తీశారు.