ధోనీకి మన దేశంతో పాటు ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా మన ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్లో కూడా ఎంఎస్‌ను ఇష్టపడే వారు ఉన్నారు. ఎంతో మంది నవతరం క్రికెటర్లకు ధోనీ ఆదర్శంగా ఉన్నాడు. చాలా మంది ఈ తరం క్రికెటర్లు ధోనీని కలవాలని అనుకుంటారు. అలా పాకిస్తాన్ ఆటగాడు ధోనీని కలిసి, ఫొటో దిగాడు. ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. పాకిస్థాన్ క్రికెటర్ షానవాజ్ దహానీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా మెంటార్ అయిన ఎంఎస్ ధోనీతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. “ఇది గొప్ప రాత్రి, పాకిస్తాన్ విజయం సాధించిన ఆనందం, నా డ్రీమ్ ప్లేయర్లలో ఒకరైన ఎంఎస్ ధోనిని కలిసిన ఉత్సాహం మరచిపోలేను” అని అతను ట్వీట్ చేశాడు. 23 ఏళ్ల షానవాజ్ దహానీ టీ20 వరల్డ్ కప్ పాకిస్తాన్ జట్టులో సభ్యుడు. ఆదివారం జరిగిన మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీ స్టేడియంలో పాక్ ఆటగాళ్లతో మాట్లాడారు. ఈ క్రమంలో పలువురు పాక్ ఆటగాళ్లు ఎంఎస్‌తో సెల్ఫీలు దిగారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 12 గ్రూప్-2 మ్యాచ్‌లో ఇండియాపై పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో152 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్లు రిజ్వాన్, అజమ్‌లు భారత బౌలర్లకు చుక్కులు చూపించారు. ఎక్కడ తడబడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పాక్ జయ కేతనాన్ని ఎగరవేసింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి నుంచి తడబడింది. పాకిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో భారత ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టారు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో కేవలం విరాట్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ను విరాట్ ఆదుకున్నాడు. 48 బంతుల్లో 57(ఐదు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు. సహచరులు ఔటైనా కెప్టెన్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. రిషబ్ పంత్, రవీంద్ర జాడేజాతో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.