
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ జట్టు దారుణ ప్రదర్శన కనబరిచిన తర్వాత జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని, జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యూజిలాండ్, భారత్ చేతిలో ఘోర పరాజయాలు ఎదుర్కొని, టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచిన పాకిస్థాన్ ప్రదర్శనపై ఇమ్రాన్ తన సోదరి అలీమాతో మాట్లాడుతూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్‌పై ఓటమి మరీ జీర్ణించుకోలేనిదని, జట్టు ఫెయిల్యూర్‌కు ఆటగాళ్లతో పాటు పీసీబీ యాజమాన్యం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారని ఆమె మీడియాతో వెల్లడించారు.
1992లో పాకిస్థాన్‌కు ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్ ఖాన్, ప్రస్తుత పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అర్హతలపై కూడా ప్రశ్నించినట్లు అలీమా చెప్పారు. “పాకిస్థాన్ క్రికెట్‌ను నాశనం చేయడం కోసం అసమర్థుల చేతిలో అధికారాన్ని పెట్టడం సరైన విధానం కాదని” ఇమ్రాన్ అభిప్రాయపడినట్లు ఆమె తెలిపారు. క్రికెట్ పరిపాలనలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే, ఇది మరింత దిగజారిపోతుందని ఆయన హెచ్చరించారని చెప్పారు.
ఇదే సమయంలో పీసీబీ మాజీ ఛైర్మన్ నజామ్ సేథి కూడా పాకిస్థాన్ క్రికెట్ పతనానికి ఇమ్రాన్ ఖానే కారణమని పరోక్షంగా విమర్శించారు. 2019 నుంచి పాక్ క్రికెట్ దిగజారడం ప్రారంభమైందని, ఇమ్రాన్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలే దీనికి కారణమని అన్నారు. దేశవాళీ క్రికెట్ వ్యవస్థను మార్చి, పాకిస్తాన్‌కు సరిపోని ఆస్ట్రేలియన్ హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేయడం, రాజకీయ జోక్యం పెరగడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. పీసీబీలో అనుభవం లేని వ్యక్తులను నియమించడం, కోచ్‌లను తరచుగా మార్చడం, సెలెక్టర్ల ఎంపికలో అక్రమాలు జరగడం వంటి అంశాలు ప్రస్తుత దారుణ పరిస్థితికి దారితీసాయని తెలిపారు.
2019లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పీసీబీ ఛైర్మన్‌గా ఎహ్సాన్ మణిని నియమించారు. దేశవాళీ క్రికెట్‌లో ఉన్న 16-18 డిపార్ట్‌మెంటల్ జట్ల వ్యవస్థను రద్దు చేసి, ఆరు జట్ల ఫస్ట్-క్లాస్ క్రికెట్ మోడల్‌ను ప్రవేశపెట్టడం వల్ల దేశీయ ఆటగాళ్ల అవకాశాలు తగ్గిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు, విభజనల కారణంగా జట్టులో గ్రూపిజం పెరిగి, కెప్టెన్సీపై పోటీ మరింత తీవ్రంగా మారిందని అభిప్రాయపడ్డారు.
ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్‌లో విస్తృత మార్పులు అవసరమని నజామ్ సేథి పేర్కొన్నారు. సరైన ప్లానింగ్, అనుభవజ్ఞులైన మేనేజ్‌మెంట్ లేకుండా పాక్ జట్టు మళ్లీ పుంజుకోవడం కష్టం అని తెలిపారు. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు కూడా పీసీబీ విధానాలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. పాక్ క్రికెట్‌లో కొనసాగుతున్న అస్తవ్యస్త పరిస్థితులు త్వరలోనే మారాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..