Phillip Hughes: నవంబర్ 27.. క్రికెట్ చరిత్రలో చాలా విషాదాన్ని నింపిన రోజు. ఏ క్రికెటర్ కూడా ఈ రోజును అంత ఈజీగా మర్చిపోలేడు. ప్రతీ క్రికెట్ ప్రేమికుడిని, ప్రతి క్రీడాకారుడిని దిగ్భ్రాంతికి అలాంటి ప్రమాదం చోటు చేసుకున్నది ఈ రోజే. 2014లో ఇదే రోజున, కేవలం 25 ఏళ్ల ప్రతిభావంతుడైన క్రికెటర్ తలకు బంతి తగిలి ప్రపంచాన్ని విడిచిపెట్టాడు. ఆస్ట్రేలియా అత్యుత్తమ ఓపెనర్ ఫిలిప్ హ్యూస్ మరణం ఆస్ట్రేలియాకే కాదు.. క్రికెట్ ప్రపంచానికే దిగ్భ్రాంతిని కలిగించింది. నేడు ఫిలిప్ హ్యూస్ 7వ వార్షికోత్సవం. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో న్యూ సౌత్ వేల్స్ ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌తో ఫిలిప్ హ్యూస్ గాయపడ్డాడు. బంతి అతని తల వెనుక తగలడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ఆ ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత నవంబర్ 27న హ్యూస్ మరణించాడు.
ఆ ప్రమాదంలో ఫిలిప్ హ్యూస్ ఎలా చనిపోయాడో తెలుసుకునే ముందు, అతని కెరీర్ గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం. తన కెరీర్‌లో హ్యూస్ 26 టెస్టుల్లో 3 సెంచరీలతో 1535 పరుగులు చేశాడు. వన్డేలలో అతని బ్యాట్ 2 సెంచరీలు, 4 అర్ధ సెంచరీల సహాయంతో 826 పరుగులు చేసింది. హ్యూస్ అంతర్జాతీయ క్రికెట్‌లో అంతగా ఆడలేదు. కానీ, కేవలం 25 ఏళ్ల వయసులో ఈ ఆటగాడు 114 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 26 సెంచరీలతో 9023 పరుగులు సాధించాడు. అదే సమయంలో లిస్ట్ ఏలో హ్యూస్ 8 సెంచరీల సహాయంతో 3639 పరుగులు చేశాడు.
ఘోర ప్రమాదం..
25 నవంబర్ 2014న చారిత్రాత్మకమైన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ జరుగుతోంది. దక్షిణ ఆస్ట్రేలియా వర్సెస్ న్యూ సౌత్ వేల్స్ మధ్య పోటీ నెలకొంది. ఫిల్ హ్యూస్ అద్భుత అర్ధ సెంచరీతో 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే క్రికెట్ అభిమానులందరి హృదయాలను కదిలించే సంఘటన చోటుచేసుకుని, ఈ ఆటగాడిని బలికొంది. ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్ బౌన్సర్‌తో దాడి చేశాడు. ఫిల్ హ్యూస్ హుక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. బంతి అతని తల వెనుక బలంగా తగిలింది. హ్యూస్ హెల్మెట్ ధరించాడు. కానీ, బంతి అతని మెడ, హెల్మెట్ మధ్య అంతరాన్ని తాకింది. బంతి తగిలిన వెంటనే హ్యూస్ నేలపై పడి స్పృహ తప్పాడు. వెంటనే మైదానంలోకి హెలికాప్టర్ చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు. సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్‌లో హ్యూస్‌కు శస్త్రచికిత్స జరిగింది. కానీ, అతను కోమాలోకి జారుకున్నాడు. ఆస్ట్రేలియా అంతటా హ్యూస్ క్షేమం కోసం ప్రార్థనలు ప్రారంభించారు. కానీ, వారి ప్రార్థనలు అతడి మరణాన్ని తప్పించలేకపోయాయి. నవంబర్ 27న హ్యూస్ మరణించాడు.
డర్బన్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ సాధించాడు..
ఫిల్ హ్యూస్ కేవలం 20 ఏళ్ల వయసులో తన రెండో టెస్టు మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికా జట్టు డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్ వంటి స్టార్ బౌలర్లను ఎదర్కొని హ్యూస్ మొదటి ఇన్నింగ్స్‌లో 115, రెండవ ఇన్నింగ్స్‌లో 160 పరుగులు సాధించాడు. ఆ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ ఆటగాడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా ఫిలిప్ హ్యూస్ నిలిచాడు. బౌన్సీ పిచ్‌పైనే కాదు, శ్రీలంక పర్యటనలో కొలంబోలో హ్యూస్ అద్భుతమైన టెస్టు సెంచరీ సాధించాడు. హ్యూస్ శ్రీలంకపై తన రెండు వన్డే సెంచరీలను కూడా సాధించాడు. హ్యూస్‌ను ఆస్ట్రేలియా తదుపరి సూపర్‌స్టార్‌గా పరిగణించారు. కానీ, కేవలం 25 సంవత్సరాల వయస్సులో ఈ ఆటగాడు అందరినీ విడిచిపెట్టడం బాధాకరం.