On This Day: కుంబ్లే 110 నాటౌట్.. భారత్ 664..19 ఏళ్ల క్రితం టీమిండియా సృష్టించిన సంచలనం
On This Day: 2007లో ది ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో భారత్ 664 పరుగులు చేసింది. 8వ స్థానంలో వచ్చిన అనిల్ కుంబ్లే 110 నాటౌట్‌తో సెంచరీ సాధించాడు. జట్టులోని 11 మంది బ్యాటర్లు డబుల్ డిజిట్ స్కోర్లు చేయడం అరుదైన రికార్డుగా నిలిచింది.

On This Day: భారత క్రికెట్ చరిత్రలో ఆగస్టు 10వ తేదీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2007 జూలై-ఆగస్టు కాలంలో టీమిండియా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటించింది. ది ఓవల్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు, ఇంగ్లాండ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ బోర్డుపై ఏకంగా 664 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఆగస్టు 9న ప్రారంభమైన ఈ టెస్టులో భారత జట్టు రెండో రోజున 664 పరుగులకు ఆలౌటైంది.
8వ నంబర్‌లో అనిల్ కుంబ్లే సెంచరీ ధమాకా
ఈ ఇన్నింగ్స్‌లో అత్యంత ప్రధాన విశేషం ఏంటంటే.. నంబర్ 8 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అద్భుతమైన సెంచరీ సాధించడం. కుంబ్లే 16 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ సెంచరీతో ఓవల్ మైదానంలో సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడైన ఆసియా ఆటగాడిగా కుంబ్లే సరికొత్త రికార్డు సృష్టించాడు. సెంచరీ చేసే సమయానికి ఆయన వయస్సు 36 సంవత్సరాల 296 రోజులు.
అరడజను హాఫ్ సెంచరీలు, అరుదైన రికార్డు
ఈ ఇన్నింగ్స్‌లో భారత అగ్రశ్రేణి బ్యాటర్లంతా రాణించారు. ఎంఎస్ ధోనీ (92), దినేష్ కార్తీక్ (91), సచిన్ టెండూల్కర్ (82), రాహుల్ ద్రావిడ్ (55), వీవీఎస్ లక్ష్మణ్ (51) హాఫ్ సెంచరీలతో మెరిశారు. వీరితో పాటు వసీమ్ జాఫర్ (35), సౌరవ్ గంగూలీ (37), జహీర్ ఖాన్ (11), ఆర్పీ సింగ్ (11), శ్రీశాంత్ (35) పరుగులు చేశారు. గడిచిన 50 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే, జట్టులోని 11 మంది ఆటగాళ్లూ డబుల్ డిజిట్ (కనీసం 10 పరుగులు) దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
డ్రాగా ముగిసిన మ్యాచ్
భారత జట్టు భారీ స్కోరు సాధించినప్పటికీ ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 345 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్, ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 180/6 వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ ముందు 500 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేజింగ్‌లో ఇంగ్లాండ్ జట్టు చివరి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 369 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రా అయ్యింది. అయినప్పటికీ ఈ టెస్ట్ మ్యాచ్ భారత్ సృష్టించిన రికార్డుల వల్ల చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
