
ODI Records: క్రికెట్ మైదానంలో ప్రతి బంతికి యాక్టివ్ గా ఉండే ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా వికెట్ కీపరే. ఏ మ్యాచ్‌లోనైనా వికెట్ కీపర్ పట్టే ఒక క్యాచ్ లేదా చేసే ఒక స్టంపింగ్ మ్యాచ్ రిజల్ట్ పూర్తిగా మార్చేయగలదు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ సుదీర్ఘ చరిత్రలో చాలా మంది గొప్ప వికెట్ కీపర్లు వచ్చారు, కానీ కొందరు మాత్రమే తమ అద్భుతమైన క్యాచ్ పట్టే నైపుణ్యంతో రికార్డులు సృష్టించారు. వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్-5 వికెట్ కీపర్లు ఎవరో ఈ వార్తలో తెలుసుకుందాం.
వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 వికెట్ కీపర్లు:
ఆడమ్ గిల్‌క్రిస్ట్ – ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్, 1996 నుండి 2008 వరకు ఆడిన 287 మ్యాచ్‌లలో 417 క్యాచ్‌లు పట్టాడు. మొత్తం 472 మందిని ఔట్ చేయడంలో పాలు పంచుకున్నాడు (క్యాచ్‌లు + స్టంపింగ్‌లు). ప్రతి ఇన్నింగ్స్‌లో అతని సగటు 1.679 డిస్మిస్సల్స్. అతను ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 6 క్యాచ్‌లు పట్టి రికార్డు సృష్టించాడు.
మార్క్ బౌచర్ – దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికాకు చెందిన నమ్మకమైన వికెట్ కీపర్ మార్క్ బౌచర్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అతను 295 వన్డేలలో 402 క్యాచ్‌లు పట్టి, మొత్తం 424 మంది ఆటగాళ్లను పెవిలియన్ పంపాడు. ప్రతి ఇన్నింగ్స్‌కు 1.462 డిస్మిస్సల్స్ సగటుతో బౌచర్, గిల్‌క్రిస్ట్‌కు గట్టి పోటీ ఇచ్చాడు.
కుమార్ సంగక్కర – శ్రీలంక
శ్రీలంకకు చెందిన గొప్ప వికెట్ కీపర్-బ్యాటర్ కుమార్ సంగక్కర, 404 మ్యాచ్‌లలో 353 ఇన్నింగ్స్‌లలో వికెట్ కీపింగ్ చేశాడు. అతను మొత్తం 383 క్యాచ్‌లు పట్టి బ్యాటర్లను వెనక్కి పంపాడు. స్టంపింగ్‌లతో కలిపి మొత్తం 482 మందిని ఔట్ చేశాడు. అతని ప్రతి ఇన్నింగ్స్ సగటు 1.365 డిస్మిస్సల్స్.
ఎంఎస్ ధోని – భారత్
భారత్ అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకరైన ఎంఎస్ ధోని, తన కెప్టెన్సీతో పాటు వికెట్ల వెనుక కూడా అద్భుతాలు చేశాడు. 350 వన్డేలలో అతను 321 క్యాచ్‌లు పట్టి, మొత్తం 444 మందిని ఔట్ చేయడంలో పాలుపంచుకున్నాడు. స్టంపింగ్‌లలో అయితే అతను అందరికంటే ముందు ఉన్నాడు. అతను మొత్తం 123 స్టంపింగ్‌లు చేసి, ఇప్పటివరకు రికార్డు సృష్టించాడు. అతని డిస్మిస్సల్ సగటు ప్రతి ఇన్నింగ్స్‌కు 1.286.
ముష్ఫికర్ రహీమ్ – బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌కు చెందిన ముష్ఫికర్ రహీమ్, 274 మ్యాచ్‌లలో 258 ఇన్నింగ్స్‌లలో వికెట్ కీపింగ్ చేశాడు. అతను 241 క్యాచ్‌లు పట్టి, మొత్తం 297 మందిని ఔట్ చేశాడు. అతని ప్రతి ఇన్నింగ్స్ సగటు 1.151 డిస్మిస్సల్స్. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 5 క్యాచ్‌లు పట్టిన రికార్డు కూడా అతని పేరు మీద ఉంది. ఇది అతన్ని ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిపింది.