
Jay Shah : టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు సృష్టించిన హైడ్రామాపై ఐసీసీ (ICC) ఛైర్మన్ జై షా ఎట్టకేలకు నోరు విప్పారు. ముంబైలో జరిగిన ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డ్స్ వేదికగా ఆయన ఆ రెండు దేశాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. క్రికెట్ ప్రపంచంలో ఏ ఒక్క జట్టు కూడా వ్యవస్థ కంటే పెద్దది కాదని, నిబంధనలు అందరికీ సమానమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీని అడ్డుకోవాలని చూసిన వారికి జై షా మాటలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
అసలేం జరిగిందంటే.. ఈ ఏడాది భారత్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించింది. భద్రతా కారణాల వంకతో తాము భారత్‌లో ఆడలేమని భీష్మించుకోవడంతో, ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుని బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలోకి తీసుకుంది. మరోవైపు, బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని తొలుత బెదిరించింది. అయితే, ఐసీసీ ఒత్తిడితో చివరి నిమిషంలో పాక్ వెనక్కి తగ్గి టోర్నీలో పాల్గొంది. ఈ వివాదాలన్నింటిపై స్పందిస్తూ.. “ఏ ఒక్క జట్టు వల్ల ఐసీసీ నడవదు. సంస్థ అనేది అన్ని జట్ల కలయిక. ఏ టీమ్ కూడా ఆర్గనైజేషన్ కంటే ఎక్కువ కాదు” అని జై షా స్పష్టం చేశారు.
ఇక టోర్నీ విజయవంతం కావడంపై జై షా హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వరల్డ్ కప్ వ్యూయర్‌షిప్ రికార్డులను తిరగరాసిందని ఆయన తెలిపారు. ఒకానొక సమయంలో ఏకంగా 7.2 మిలియన్ల మంది లైవ్ వ్యూయర్స్ టోర్నీని వీక్షించారని, ఇది క్రికెట్ చరిత్రలోనే ఒక మైలురాయి అని కొనియాడారు. కేవలం పెద్ద జట్లే కాకుండా యూఎస్ఏ, నెదర్లాండ్స్, జింబాబ్వే, నేపాల్ వంటి చిన్న జట్లు కూడా దిగ్గజ జట్లకు గట్టి పోటీ ఇచ్చి క్రికెట్ స్థాయిని పెంచాయని ఆయన ప్రశంసించారు.
చివరగా ప్రపంచకప్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్‌లకు జై షా ఒక కీలక సందేశం ఇచ్చారు. శిఖరాగ్రం నుంచి కిందకు పడిపోవడానికి కొన్ని నెలలు చాలని, కానీ అట్టడుగు నుంచి పైకి ఎదగడానికి ఏళ్లు పడుతుందని హెచ్చరించారు. కష్టపడి పని చేస్తూ విజయ పరంపరను కొనసాగించాలని సూచించారు. 2028 ఒలింపిక్స్‌తో పాటు 2030, 2031, 2036 వరకు భారత క్రికెట్ భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..