Mustafizur Rahman : ముస్తాఫిజుర్‌కు కేకేఆర్ బిగ్ షాక్..ఐపీఎల్ నుంచి పంపేసినా ఒక్క రూపాయి కూడా దక్కదా?

Mustafizur Rahman : బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ 2026 నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి రావడం ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారితీసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అతడిని వేలంలో ఏకంగా రూ.9.2 కోట్లకు కొనుగోలు చేసింది.

Mustafizur Rahman : ముస్తాఫిజుర్‌కు కేకేఆర్ బిగ్ షాక్..ఐపీఎల్ నుంచి పంపేసినా ఒక్క రూపాయి కూడా దక్కదా?
Bangladesh Pacer Mustafizur Rahman

Updated on: Jan 06, 2026 | 5:15 PM

Mustafizur Rahman : బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ 2026 నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి రావడం ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారితీసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అతడిని వేలంలో ఏకంగా రూ.9.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో అతను టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. మరి ఇంత భారీ ధరకు అమ్ముడైన ముస్తాఫిజుర్‌కు కేకేఆర్ ఒక్క రూపాయి అయినా ఇస్తుందా? ఐపీఎల్ నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

డబ్బులు వచ్చే ఛాన్స్ ఉందా?

నిజానికి, ముస్తాఫిజుర్ రెహమాన్ తనంతట తానుగా ఐపీఎల్ నుంచి తప్పుకోలేదు. కానీ బీసీసీఐ అతడిని టోర్నీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణంగా ఏదైనా కారణం వల్ల ఆటగాడిని కొనుగోలు చేసి కూడా ఆడించకపోతే వారికి పరిహారం అందుతుందా అనే అనుమానం అందరికీ ఉంటుంది. అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం ముస్తాఫిజుర్‌కు కేకేఆర్ నుండి ఎటువంటి నగదు అందే అవకాశం లేదు. అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే, టోర్నీ ప్రారంభానికి ముందే వెనక్కి వెళ్తున్నాడు కాబట్టి, ఫ్రాంచైజీ అతడికి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

బీమా నియమాలు ఏం చెబుతున్నాయి?

సాధారణంగా ఐపీఎల్ ఆటగాళ్లకు బీమా సౌకర్యం ఉంటుంది. ఒకవేళ ఒక ఆటగాడు జట్టు క్యాంప్‌లో చేరిన తర్వాత లేదా టోర్నీ మధ్యలో గాయపడితే, ఆ ఆటగాడికి అందాల్సిన మొత్తాన్ని ఫ్రాంచైజీ చెల్లిస్తుంది. కానీ, ముస్తాఫిజుర్ కేసులో ఆయనకు ఎటువంటి గాయం కాలేదు. క్రికెట్ సంబంధిత కారణాల వల్ల కాకుండా, ఇతర దౌత్య లేదా పరిపాలనా కారణాల వల్ల అతడిని తొలగించారు. ఇలాంటి పరిస్థితులు సాధారణ బీమా నిబంధనల కిందకు రావు. అందుకే కేకేఆర్ యాజమాన్యం అతడికి ఒక్క పైసా కూడా ఇచ్చేందుకు సిద్ధంగా లేదు.

ముస్తాఫిజుర్ ముందున్న దారులు ఏంటి?

ముస్తాఫిజుర్ తన హక్కుల కోసం న్యాయపోరాటం చేసే అవకాశం ఉన్నప్పటికీ అది అంత సులభం కాదు. ఐపీఎల్ భారతీయ చట్టాల పరిధిలోకి వస్తుంది. విదేశీ ఆటగాళ్లు భారత కోర్టుల చుట్టూ తిరగడం లేదా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‎ను ఆశ్రయించడం చాలా ఖరీదైన మరియు సుదీర్ఘమైన ప్రక్రియ. పైగా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా అతడికి ఇచ్చిన ఎన్‌ఓసీని వెనక్కి తీసుకుంది. దీనివల్ల ముస్తాఫిజుర్ పక్షం మరింత బలహీనపడింది. వెరసి, రూ.9.2 కోట్ల భారీ కాంట్రాక్ట్ దక్కినట్లే దక్కి.. చివరకు ముస్తాఫిజుర్ ఖాళీ చేతులతో స్వదేశానికి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..