AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవర్రా సామీ.. 10 ఫోర్లు, 12 సిక్స్‌లతో బీభత్సం.. 29 బంతుల్లోనే 352 స్ట్రైక్‌ రేట్‌‌తో అనామకుడి ఊచకోత..

Muhammad Fahad Smashed 29 Ball Century: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 29 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు ఒక గుర్తు తెలియని బ్యాట్స్‌మన్. ఈ బ్యాట్స్‌మన్ కేవలం 34 బంతుల్లోనే 120 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ బలమైన బ్యాటింగ్ ఆధారంగా అతని జట్టు కేవలం 71 బంతుల్లోనే 200 పరుగులు చేసింది.

ఎవర్రా సామీ.. 10 ఫోర్లు, 12 సిక్స్‌లతో బీభత్సం.. 29 బంతుల్లోనే 352 స్ట్రైక్‌ రేట్‌‌తో అనామకుడి ఊచకోత..
Muhammad Fahad
Venkata Chari
|

Updated on: Jul 13, 2025 | 7:45 AM

Share

Muhammad Fahad Smashed 29 Ball Century: క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ఇటీవల బల్గేరియా ట్రై-నేషన్ టీ20ఐ సిరీస్‌లో చోటు చేసుకుంది. తుర్కియే (టర్కీ) ఆటగాడు ముహమ్మద్ ఫహద్ కేవలం 29 బంతుల్లోనే సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తుర్కియే జట్టు కేవలం 71 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కును దాటింది.

ముహమ్మద్ ఫహద్ విధ్వంసం..

బల్గేరియాపై జరిగిన మ్యాచ్‌లో తుర్కియే తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ముహమ్మద్ ఫహద్, మొదటి బంతి నుంచే బల్గేరియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 29 బంతుల్లోనే శతకం పూర్తి చేసి, టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీల జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు. అంతకుముందు సాహిల్ చౌహాన్ 27 బంతుల్లో సెంచరీ సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు.

ఫహద్ తన 34 బంతుల ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 12 భారీ సిక్సర్లు బాదాడు, మొత్తం 120 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 352.94గా నమోదైంది.ఇది అతని విధ్వంసకర బ్యాటింగ్‌కు నిదర్శనం.

అంతర్జాతీయ టీ20లో అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన బ్యాటర్స్..

  1. సాహిల్ చౌహాన్ – 27 బంతులు
  2. ముహమ్మద్ ఫహాద్ – 29 బంతులు
  3. జాన్ నికెల్ లాఫ్టీ ఈటన్ – 33 బంతులు
  4. సికందర్ రజా – 33 బంతులు
  5. కుశాల్ మల్లా – 34 బంతులు

టర్కీ జట్టు డబుల్ సెంచరీ మార్క్..

ముహమ్మద్ ఫహద్ అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా, తుర్కియే జట్టు కేవలం 71 బంతుల్లో (11.5 ఓవర్లు) 200 పరుగుల మార్కును చేరుకుంది. టీ20 క్రికెట్‌లో ఇది అత్యంత వేగవంతమైన 200 పరుగుల స్కోరుగా నిలిచింది. ఫహద్‌తో పాటు ఇల్యాస్ అతౌల్లా 44 పరుగులు, కెప్టెన్ అలీ తుర్క్‌మెన్ 36 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు.

మ్యాచ్ రిజల్ట్..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన తుర్కియే, ఫహద్ మెరుపు సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే, 208 పరుగుల వద్ద కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన తుర్కియే, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి మొత్తం 237 పరుగులకు ఆలౌట్ కావడం విశేషం.

238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బల్గేరియా, తుర్కియే బౌలర్ల ధాటికి 16.5 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో తుర్కియే 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తుర్కియే బౌలర్లలో ఇల్యాస్ అతౌల్లా 4 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో ముహమ్మద్ ఫహద్ చూపిన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. తక్కువ బంతుల్లోనే భారీ పరుగులు చేయగల అతని సామర్థ్యం, టీ20 క్రికెట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించిందని చెప్పొచ్చు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..