MS Dhoni: 43 ఏళ్ల వయసులో ఆడటం అంత ఈజీగా కాదు.. ఐపీఎల్ కోసం నేనెంత కష్టపడతానంటే..! తొలిసారి ఓపెన్ అయిన ధోని
టీమిండియా మాజీ కెప్టెన్ ధోని, 43 ఏళ్ల వయసులోనూ, మోకాలి నొప్పితో బాధపడుతూ కూడా, తన అభిమానుల కోసం ఐపీఎల్ ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా, అతనికి ఉన్న అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కోరిక మేరకు ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. అయితే ఈ ఐపీఎల్ కోసం ధోని ఎంత కష్టపడతాడో తాజాగా వెల్లడించాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అభిమానుల కోసం ఐపీఎల్ ఆడుతున్నాడనే విషయం తెలిసిందే. 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా కేవలం తన అభిమానుల కోసం మోకాలి నొప్పితో బాధపడుతున్నా కూడా ధోని ఐపీఎల్ ఆడుతున్నాడు. అయితే.. ప్రస్తుతం ధోనికి 43 ఏళ్లు. ఈ ఏజ్‌లో కూడా కుర్రాళ్లతో పోటీ పడాలంటే తాను ఎంత కష్టపడతుండాటో తాజాగా ధోని వెల్లడించాడు. ఈ వయసులో ఐపీఎల్ లాంటి ఓ హెవీ కాంపిటీషన్ ఉండే టోర్నీ ఆడటం అంత సులువైన విషయం కాదని అన్నాడు. ఐపీఎల్ ఆడేందుకు తాను కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ప్రిపేర్ అవుతానని పేర్కొన్నాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత తన ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతున్న ధోని, కేవలం ఐపీఎల్ సీజన్‌లో మాత్రమే మనకు గ్రౌండ్‌లో కనిపిస్తాడు. కానీ, ఆ రెండున్నర నెలల పాటు గ్రౌండ్‌లో ఉండేందుకు ఓ ఆరు నెలల పాటు శ్రమిస్తానంటూ తెలిపాడు. గత రెండు సీజన్లుగా ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయినా కూడా తాను ఆడాలని తన అభిమానులు ఎంతో బలంగా కోరుకుంటున్న తరుణంలో ఐపీఎల్ ఆడుతున్నాడు ధోని. అతనికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఇండియన్ క్రికెట్ హిస్టరీలో తనకంటే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధోని అంటే కొన్ని కోట్ల మంది పడిచస్తుంటారు. వారి కోసమే ధోని తన శరీరానికి ఇబ్బంది అవుతున్న ఐపీఎల్ ఆడుతున్నాడు.
అయితే ఈ ఐపీఎల్ 2025 సీజన్ మార్చ్ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో ధోని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడుతున్నాడు. ఐపీఎల్ కోసం బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ధోని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. అన్‌క్యాప్డ్ ప్లేయర్ అంటే జాతీయ జట్టుకు ఇంక ఆడని ప్లేయర్ లేదా అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లుగా యాక్టివ్‌గా లేని ప్లేయర్లను అన్ క్యాప్డ్ ప్లేయర్లుగా పేర్కొంటారు. ధోని అంతర్జాతీయ క్రికెట్ ఆడక ఐదేళ్లు అవుతున్న క్రమంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ లిస్ట్ లోకి వస్తాడు. ఈ సీజన్‌లో ధోనికి కేవలం రూ.4 కోట్లు మాత్రమే చెల్లిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




