
Viarl Video : ఐపీఎల్ అంటేనే ఉత్కంఠకు కేరాఫ్ అడ్రస్. అందులోనూ దశాబ్దాల ప్రత్యర్థులు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయంటే ఆ మైదానంలో వాతావరణం ఎలా ఉంటుందో ఊహించవచ్చు. శనివారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ముంబై బ్యాటర్ తలకి బంతి బలంగా తగిలి పెను ప్రమాదం తృటిలో తప్పింది. అయితే ఈ సీరియస్ ఘటన చూసి వికెట్ కీపర్ సంజు శాంసన్ నవ్వు ఆపుకోలేకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
అసలేం జరిగిందంటే?
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 20వ ఓవర్ చివరి బంతి వద్ద ఈ డ్రామా జరిగింది. చెన్నై బౌలర్ అన్షుల్ కాంబోజ్ వేసిన బంతిని బ్యాటర్ కృష్ భగత్ సరిగ్గా షాట్ ఆడలేకపోయాడు. అయితే అది చివరి బంతి కావడంతో ఒక పరుగు కోసం బ్యాటర్లు ఇద్దరూ పరుగు లంకించుకున్నారు. వికెట్ కీపర్ సంజు శాంసన్ వెంటనే బంతిని అందుకొని బౌలర్ అన్షుల్ వైపు విసిరాడు. అన్షుల్ ఆ బంతిని అందుకుని నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న స్టంప్స్‌ను పడగొట్టేందుకు గట్టిగా విసిరాడు. సరిగ్గా అదే సమయంలో కృష్ భగత్ క్రీజులోకి పరుగెత్తుకుంటూ వస్తున్నాడు.
తృటిలో తప్పిన ముప్పు
అన్షుల్ విసిరిన బంతి స్టంప్స్‌కు తగలకుండా కేవలం 2-3 మీటర్ల దూరం నుంచి కృష్ భగత్ తల వెనుక భాగానికి బలంగా తగిలింది. ఆ వేగానికి బంతి నేరుగా తగిలి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. కానీ కృష్ హెల్మెట్ ధరించి ఉండటంతో పెను ముప్పు తప్పింది. బంతి హెల్మెట్‌కు తగలడంతో అతను సురక్షితంగా బయటపడ్డాడు. ఆ పరుగు కూడా పూర్తయ్యింది. అయితే ఈ దృశ్యాన్ని చూసిన సంజు శాంసన్ తన నవ్వును ఆపుకోలేకపోయాడు. మైదానంలోనే పడిపడి నవ్వడం కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
Oops! 😅 Hope Krish Bhagat is okay 👍#TATAIPL Revenge Week 2026 ➡️ #CSKvMI | LIVE NOW 👉https://t.co/wLcMjiCsSi pic.twitter.com/qtJc0iSLcE
— Star Sports (@StarSportsIndia) May 2, 2026
ఈ ఒక పరుగుతో ముంబై ఇండియన్స్ స్కోరు 159 పరుగులకు చేరుకుంది. నిజానికి ముంబై ఇన్నింగ్స్ మొదట్లో చాలా వేగంగా సాగింది. ఓపెనర్ రాయన్ రికల్టన్ (37), నమన్ ధీర్ (57) కలిసి 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా కొన్ని మెరుపులు మెరిపించాడు. కానీ మధ్య ఓవర్లలో చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రన్ రేట్ పడిపోయింది. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేయడంతో ముంబై భారీ స్కోరు సాధించలేకపోయింది.
బౌలర్ల ఆధిపత్యం
చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ అద్భుతంగా రాణించాడు. కేవలం 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా 26 పరుగులకే 2 వికెట్లు తీసి ముంబైని దెబ్బతీశాడు. జేమీ ఓవర్టన్ తన వంతుగా ఒక వికెట్ తీసి కట్టుదిట్టమైన స్పెల్ వేశాడు. పీల్డింగ్‌లో కూడా చెన్నై ఆటగాళ్లు చురుగ్గా కదిలారు. మొత్తానికి ఒకవైపు సీరియస్ మ్యాచ్ సాగుతుండగా, మరోవైపు ఈ ఫన్నీ అండ్ డేంజరస్ ఇన్సిడెంట్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..