
Shahid Afridi : ఆసియా కప్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్‌లో రాజకీయ వేడి రాజుకుంది. పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఆసియా కప్‌లో పాకిస్తాన్ జట్టు ఘోర పరాజయం, ట్రోఫీ చుట్టూ జరిగిన వివాదాల నేపథ్యంలో అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు క్రికెట్ బోర్డు చీఫ్‌గా, మరోవైపు పాకిస్తాన్ హోంమంత్రిగా రెండు కీలక పదవులను నిర్వహించడం సరికాదని, క్రికెట్‌కు పూర్తి స్థాయి శ్రద్ధ అవసరమని అఫ్రిది నొక్కి చెప్పారు.
“నఖ్వీ సాహెబ్‌కు సలహా ఏమిటంటే ఈ రెండు చాలా ముఖ్యమైన పోస్టులు, వాటికి చాలా సమయం కావాలి” అని టెలికాం ఆసియా స్పోర్ట్‌తో అఫ్రిది అన్నారు. హోంమంత్రి పదవికి, పీసీబీ ఛైర్మన్ పదవికి మధ్య నఖ్వీ సమన్వయం సాధించలేకపోతున్నారని అఫ్రిది ఆరోపించారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కూడా నఖ్వీకి పూర్తి స్థాయి పీసీబీ ఛైర్మన్‌గా ఉండాలని అఫ్రిది సలహా ఇచ్చారు. ఆసియా కప్ వైఫల్యం తర్వాత, అఫ్రిది తన విమర్శలను మరింత తీవ్రతరం చేశారు. నఖ్వీకి క్రికెట్ గురించి సరైన అవగాహన లేదని అఫ్రిది మండిపడ్డారు.
“పీసీబీ అనేది హోంమంత్రిత్వ శాఖకు కంప్లీట్ డిఫరెంట్, కాబట్టి దానిని వేరుగా ఉంచాలి. ఇది ఒక పెద్ద నిర్ణయం, వీలైనంత త్వరగా తీసుకోవాలి. పాకిస్తాన్ క్రికెట్‌కు ప్రత్యేక శ్రద్ధ, సమయం అవసరం. నఖ్వీ సలహాదారులపై పూర్తిగా ఆధారపడలేడు. ఈ సలహాదారులు అతనిని ఎక్కడికీ తీసుకెళ్లలేరు. తనకు క్రికెట్ గురించి అంతగా తెలియదని అతడే అంటున్నాడు. అతడు ఆట గురించి తెలిసిన మంచి, సమర్థులైన సలహాదారులను నియమించుకోవాలి” అని అఫ్రిది అన్నారు.
ఆసియా కప్‌లో భారత జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించినప్పుడు అనవసరమైన డ్రామా సృష్టించారని నఖ్వీపై ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ చర్య తీసుకోలేదని పాకిస్తాన్ జట్టు టోర్నమెంట్‌ను బహిష్కరిస్తామని బెదిరించింది. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఉగ్రవాద దాడిని ఉద్దేశిస్తూ నఖ్వీ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్‌ను షేర్ చేయడం కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఫైనల్ రోజున ట్రోఫీ వివాదం పతాక స్థాయికి చేరింది. భారత జట్టు తన చేతి నుండి ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించడంతో, నఖ్వీ ఏసీసీ అధ్యక్షుడిగా ట్రోఫీని అసలు బహూకరించడానికి నిరాకరించారు. బదులుగా, పోస్ట్-మ్యాచ్ వేడుకలో ఒక ఏసీసీ అధికారి పోడియం నుండి ట్రోఫీ, విజేతల పతకాలను తొలగించడం కనిపించింది.
జియో సూపర్ నివేదిక ప్రకారం.. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా దుబాయ్‌లోని ఏసీసీ మెయిన్ ఆఫీసుకు వచ్చి ట్రోఫీని తీసుకోవాలని నఖ్వీ పట్టుబట్టారు. నఖ్వీ ప్రవర్తనపై సెప్టెంబర్ 30న జరిగిన ఏసీసీ సమావేశంలో బీసీసీఐ అధికారులు, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తీవ్రంగా విమర్శించారు. బీసీసీఐ నఖ్వీపై అధికారిక ఫిర్యాదును కూడా పరిశీలిస్తున్నట్లు ఇండియా టుడే నివేదించింది.
ఆసియా కప్‌లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన, ఫైనల్ చుట్టూ జరిగిన గందరగోళ సంఘటనలు టోర్నమెంట్ ప్రతిష్టను దెబ్బతీశాయి. పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో నఖ్వీకి వ్యతిరేకంగా పెరుగుతున్న స్వరాలతో, క్రికెట్ నిర్వాహకుడిగా అతని భవిష్యత్తు మరింత ప్రశ్నార్థకంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..