Match Fixing : లంక లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. భారత మాజీ క్రికెటర్ అరెస్ట్

Match Fixing : లంక ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభానికి ముందే మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేగింది. భారత మాజీ అండర్-19 వరల్డ్ కప్ హీరో మంజోత్ కల్రాను శ్రీలంక అధికారులు అరెస్ట్ చేశారు. ఆటగాడికి లంచం ఆఫర్ చేసిన ఆరోపణలు క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాయి.

Match Fixing : లంక లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. భారత మాజీ క్రికెటర్ అరెస్ట్
Manjot Kalra

Updated on: Jul 17, 2026 | 4:47 PM

Match Fixing : క్రికెట్ ప్రపంచంలో మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ భూతం కలకలం రేపింది. లంక ప్రీమియర్ లీగ్(LPL) కొత్త సీజన్ ప్రారంభానికి కొద్ది గంటల ముందే ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. భారత మాజీ అండర్-19 క్రికెటర్, లంక లీగ్‌లోని జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీ సహ యజమాని అయిన మంజోత్ కల్రాను శ్రీలంక స్పోర్ట్స్ యాంటీ కరప్షన్ విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. ఒక ఆటగాడికి భారీగా లంచం ఇవ్వజూపి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పురికొల్పినట్లు అతనిపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

LPL 2026 ప్రారంభానికి ముందే షాక్

ఈ ఏడాది లంక ప్రీమియర్ లీగ్(LPL 2026) సీజన్ జూలై 17 నుంచే ఘనంగా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే టోర్నమెంట్ మొదలయ్యే సరిగ్గా అదే రోజున ఈ అరెస్ట్ జరగడం క్రీడా వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. క్రీడల్లో జరిగే అవినీతి, అక్రమాలపై నిఘా ఉంచేందుకు శ్రీలంక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగి మంజోత్‌ను అదుపులోకి తీసుకుంది. అనంతరం అతన్ని స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

ఆటగాళ్లకు భారీగా లంచం ఆఫర్

శ్రీలంక పోలీసుల అధికారిక సమాచారం ప్రకారం.. 27 ఏళ్ల మంజోత్ కల్రా లంక లీగ్ ప్రారంభానికి దాదాపు పది రోజుల ముందే ఈ ఫిక్సింగ్ స్కెచ్ వేశాడు. జాఫ్నా కింగ్స్ జట్టుకు చెందిన ఒక కీలక ఆటగాడిని సంప్రదించి, మ్యాచ్ ఫలితాన్ని మార్చడం కోసం భారీ మొత్తంలో లంచం ఆఫర్ చేశాడు. అయితే ఆ ఆటగాడు లొంగకుండా, వెంటనే ఈ విషయాన్ని లీగ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో యాంటీ కరప్షన్ విభాగం గుట్టుచప్పుడు కాకుండా విచారణ జరిపి, శుక్రవారం నాడు ఈ భారత మాజీ క్రికెటర్‌ను అరెస్ట్ చేసింది.

ఈ మొత్తం వ్యవహారంలో శ్రీలంక జాతీయ జట్టు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం జాఫ్నా కింగ్స్ జట్టులో సభ్యులుగా ఉన్న స్టార్ క్రికెటర్లు భనుక రాజపక్స, అవిష్క ఫెర్నాండోలతో పాటు యువ సంచలనం దునిత్ వెల్లలాగే ఈ ఫిక్సింగ్ యత్నాలపై యాంటీ కరప్షన్ యూనిట్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తమ జట్టు ఫ్రాంచైజీ ఓనరే ఇలాంటి అక్రమాలకు పాల్పడటంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేనేజ్‌మెంట్‌ను ఆశ్రయించడంతో ఈ కుంభకోణం బయటపడింది.

క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న వివాదాలు

లంక ప్రీమియర్ లీగ్‌ను వివాదాలు చుట్టుముట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఇదే ఏడాది ప్రారంభంలో ఒక ఫ్రాంచైజీ యజమాని ఆటగాళ్లను మ్యాచ్ ఫిక్సింగ్ చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చినట్లు రుజువైంది. ఆ కేసులో సదరు ఓనర్‌పై ఐసీసీ, లంక బోర్డు కఠిన చర్యలు తీసుకుంటూ ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు క్రికెట్ కార్యకలాపాల నుంచి నిషేధాన్ని విధించాయి. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో మరో ఫ్రాంచైజీ ఓనర్ దొరికిపోవడంతో లంక లీగ్ ప్రతిష్ట మసకబారింది.

నిజానికి మంజోత్ కల్రా భారత క్రికెట్‌లో ఒకప్పుడు ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు. 2018లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన సెంచరీ (నాటౌట్ 101 పరుగులు) బాది టీమిండియాను ప్రపంచ విజేతగా నిలిపిన ఘనత అతనిది. ప్రస్తుత భారత స్టార్ ప్లేయర్లు శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా వంటి వారితో కలిసి మంజోత్ ఆ వరల్డ్ కప్ ఆడాడు. ఆ తర్వాత వయస్సు తేడాల వివాదంలో చిక్కుకుని దేశవాళీ క్రికెట్‌కు దూరమైన మంజోత్, చివరకు ఇలా లంక లీగ్ ఫ్రాంచైజీ ఓనర్‌ అవతారమెత్తి బుకీగా మారి జైలు పాలు కావడం గమనార్హం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us