
Ind vs Pak : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌కు గట్టిగా సమాధానం ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ నిర్వహించి పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీని ప్రభావం క్రీడలపై కూడా పడింది. సెప్టెంబర్ 14న ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్‌లో తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తక్షణ విచారణకు కోర్టు నిరాకరించింది.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
సెప్టెంబర్ 14న జరగబోయే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు స్పందించింది. పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది, మ్యాచ్ ఆదివారం ఉందని, శుక్రవారం ఈ కేసును విచారించకపోతే పిటిషన్ నిరుపయోగం అవుతుందని వాదించారు. దీనిపై జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం.. ఇంత తొందర ఎందుకు? మ్యాచ్ ఆదివారమేనా? మేము ఏం చేయగలం? అది జరగనివ్వండి. మ్యాచ్ కొనసాగాలి అని వ్యాఖ్యానించింది.
పిటిషన్‌లో ఏముంది?
ఉర్వశి జైన్ ఆధ్వర్యంలో నలుగురు లా విద్యార్థులు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పహల్‌గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించడం జాతీయ గౌరవం, ప్రజల మనోభావాలకు వ్యతిరేకమని పిటిషన్‌లో పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య క్రికెట్ సఖ్యత, స్నేహాన్ని చూపించడానికి ఉద్దేశించిందని, కానీ పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత, మన సైనికులు ప్రాణత్యాగం చేసినప్పుడు, అలాంటి మ్యాచ్ దేశంలో తప్పుడు సందేశాన్ని ఇస్తుందని అన్నారు.
భావోద్వేగాలకు దెబ్బ
“మన సైనికులు ప్రాణత్యాగం చేస్తుంటే, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశంతో మనం క్రీడా ఉత్సవాలను జరుపుకుంటున్నాం. ఇది పాకిస్థాన్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాల మనోభావాలను దెబ్బతీస్తుంది. దేశ గౌరవం, పౌరుల భద్రత వినోదం కంటే ముఖ్యమైనవి” అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై రాజకీయాలు కూడా మొదలయ్యాయి.
దేశంలో మొదలైన రాజకీయాలు
శివసేన (యుబిటి) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఈ మ్యాచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. “మేము ఈ మ్యాచ్‌ను వ్యతిరేకిస్తాం. మేము వ్యతిరేకతకు గుర్తుగా సిందూర్ రక్షా అభియాన్ ను నిర్వహిస్తాం. ఈ సమయంలో మహిళలు రోడ్లపై నిరసనలు తెలుపుతారు” అని అన్నారు.
#WATCH | Mumbai: On India's match against Pakistan in Asia Cup 2025, Shiv Sena (UBT) MP Sanjay Raut says, "…We will protest against this India-Pakistan cricket match. Women will come on the streets and our campaign is 'Sindoor Raksha Abhiyan'…You said that water and blood… pic.twitter.com/G29yNfdNqk
— ANI (@ANI) September 11, 2025
సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. “నీరు, రక్తం కలిసి ప్రవహించనప్పుడు, రక్తం, క్రికెట్ ఎలా కలిసి సాగుతాయి?” అని ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, పహల్‌గామ్‌లో 26 మంది మహిళల సిందూరాన్ని చెరిపివేశారని.. వారి బాధ, కోపం ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. “వారు ఇంకా షాక్‌లో ఉన్నారు, కానీ మీరు పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటానికి వెళ్తున్నారు. ఇది సిగ్గులేనితనం, దేశద్రోహం” అని ఆయన అన్నారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, విశ్వ హిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ , బజరంగ్ దళ్‌లను ఈ విషయంలో వారి పాత్ర ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వంపై తనకు కోపం లేదని, బీజేపీ, ఇతర సంస్థలపై ఉందని సంజయ్ రౌత్ అన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి