9 బంతుల్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. దెబ్బకు యువీ రికార్డు బ్రేక్.! టీ20ల్లో సరికొత్త చరిత్ర..

టీ20 చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసుకుంది చిన్న జట్టయిన నేపాల్ టీం. ఏషియన్ గేమ్స్‌లో భాగంగా నేపాల్, మంగోలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పలు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఇందులో నేపాల్ బ్యాట్స్‌మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి.. పరుగుల వరద పారించారు.

9 బంతుల్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. దెబ్బకు యువీ రికార్డు బ్రేక్.! టీ20ల్లో సరికొత్త చరిత్ర..
Nepal Vs Mongolia

Updated on: Sep 27, 2023 | 1:34 PM

టీ20 చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసుకుంది చిన్న జట్టయిన నేపాల్ టీం. ఏషియన్ గేమ్స్‌లో భాగంగా నేపాల్, మంగోలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పలు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఇందులో నేపాల్ బ్యాట్స్‌మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి.. పరుగుల వరద పారించారు. దెబ్బకు టీమిండియా వెటరన్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ రికార్డులను బద్దలుకొట్టారు. అంతేకాదు టీ20ల్లో నేపాల్ జట్టు అత్యధిక టీం స్కోర్‌ను నమోదు చేయడంతో పాటు.. అతిపెద్ద విజయాన్ని కూడా అందుకుంది. మరి ఆ మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే..!

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటరలైన కుశల్ మల్లా, దీపేంద్ర సింగ్, రోహిత్ పౌడేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కుశాల్ మల్లా 34 బంతుల్లోనే 12 సిక్సర్లు, 8 ఫోర్లతో 137 పరుగులు బాదేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సఫారీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలుకొట్టాడు. వీరిద్దరూ 35 బంతుల్లో సెంచరీలు చేయగా.. కుశాల్ కేవలం 34 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. అటు కెప్టెన్ రోహిత్ పౌడేల్ 2 ఫోర్లు, 6 సిక్సులతో 27 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు.

ఇక 19వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన దీపేంద్ర సింగ్ 8 సిక్సులతో 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీని బాదేశాడు. 10 బంతుల్లో 52 పరుగులు కొట్టాడు. దీంతో యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు దీపేంద్ర. కేవలం 9 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. చివరి వరకు క్రీజులో నిల్చున్న కుశాల్ మల్లా(137), దీపేంద్ర(52).. నేపాల్ జట్టు స్కోర్‌ను 300 మార్క్ దాటించారు. అలాగే ఈ నేపాల్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 26 సిక్సర్లు నమోదు కాగా.. ఇదే ఓ టీ20 ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక సిక్సర్లు.. గతంలో ఆఫ్గనిస్తాన్(22) పేరిట ఉన్న ఈ రికార్డు బ్రేక్ అయింది.

మరోవైపు నేపాల్ బ్యాటర్ల విధ్వంసానికి మంగోలియా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించారు. ఏకంగా ముగ్గురు బౌలర్లు 50కిపైగా పరుగులు ఇచ్చారు. అటు ఎక్స్‌ట్రాల రూపంలో మంగోలియా టీం ఏకంగా 29 పరుగులు సమర్పించుకుంది. అనంతరం కొండంత లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన మంగోలియా జట్టు కేవలం 13.1 ఓవర్లలోనే 41 పరుగులకు ఆలౌట్ అయింది. దవాసురేన్(10) ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే మంగోలియా టీంలో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. దీంతో నేపాల్ ఏకంగా 273 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక టీ20 చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద విజయం సాధించడం ఇదే కావడంతో.. కొత్త రికార్డులు లిఖించబడ్డాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..