- Telugu News Photo Gallery Cricket photos Asian Games 2023: Nepal's Kushal Malla becomes fastest player to smash t20I Century and Breaks David Miller, Rohit Sharma's Record
Asian Games 2023: ఆసియా క్రీడల్లో 12 సిక్సర్లతో నేపాలీ బ్యాటర్ విధ్వంసం.. దెబ్బకి మిల్లర్, రోహిత్ రికార్డ్‌లు గల్లంతు..
Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో నేపాల్, మంగోలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో నేపాలీ యువ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. కుశల్ మల్ల 137*, రోహిత్ పౌడెల్ 61, దీపేంద్ర సింగ్ 52* పరుగులతో నేపాల్‌కి భారీ స్కోర్ అందించారు. అయితే కుశల్ మల్ల తన తొలి టీ20 సెంచరీతోనే డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్ల పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డ్‌ను తన సొంతం చేసుకున్నాడు.
Updated on: Sep 27, 2023 | 2:59 PM

NEP vs MGL: నేపాలీ బ్యాటర్ కుశల్ మల్ల మంగోలియాపై రెచ్చిపోయాడు. ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన ప్రారంభ టీ20 మ్యాచ్‌లో అతను 50 బంతుల్లోనే 8 ఫోర్లు, 12 సిక్సర్లతో అజేయంగా 137 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కుశల్ 34 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోవడం గమనార్హం.

అంతర్జాతీయ క్రికెట్‌లో నేపాల్ తరఫున 16వ టీ20 ఆడుతున్న కుశల్ 34 బంతుల్లోనే సెంచరీ చేయడమే కాక ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా శతకం బాదిన ఆటగాడిగా అవతరించాడు.

నిజానికి ఇంతక ముందు ఈ రికార్డ్ డేవిడ్ మిల్లర్(సౌతాఫ్రికా), రోహిత్ శర్మ(భారత్), సుదేశ్ విక్రమసేకర(సీజెక్ రిపబ్లిక్) పేరిట ఉండేది. వీరంతా 35 బంతుల్లోనే అంతర్జాతీయ టీ20 సెంచరీ నమోదు చేశారు. కానీ తాజాగా ఆ రికార్డ్‌ను 34 బంతుల్లోనే సెంచరీ సాధించిన కుశల్ మల్ల సొంతం చేసుకున్నాడు.

విశేషం ఏమిటంటే.. 137 పరుగులు చేసిన కుశల్ మల్లతో పాటు కెప్టెన్ రోహిత్ పౌడెల్ 61 , దీపేంద్ర సింగ్ 52* కూడా రాణించడంతో మంగోలియాపై నేపాల్ 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఇది టీ20 ఫార్మాట్‌లో అత్యధిక స్కోర్.

కాగా, నేపాల్ ఇచ్చిన భారీ స్కోర్‌తో బరిలోకి దిగిన మంగోలియా 41 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో నేపాల్ ఏకంగా 273 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది.





























