KKR vs SRH : 311 రోజుల తర్వాత మళ్ళీ పోరాడుతున్నారు… పాత బాకీలు వసూలు చేసుకునేది ఎవరో?

KKR vs SRH : ఐపీఎల్ 2026లో మరో హై-వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి. దాదాపు 311 రోజుల తర్వాత ఈ రెండు జట్లు ఐపీఎల్ పిచ్‌పై ముఖాముఖి తలపడుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

KKR vs SRH : 311 రోజుల తర్వాత మళ్ళీ పోరాడుతున్నారు... పాత బాకీలు వసూలు చేసుకునేది ఎవరో?
Kkr Vs Srh

Updated on: Apr 02, 2026 | 12:41 PM

KKR vs SRH : ఐపీఎల్ 2026లో మరో హై-వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి. దాదాపు 311 రోజుల తర్వాత ఈ రెండు జట్లు ఐపీఎల్ పిచ్‌పై ముఖాముఖి తలపడుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ మ్యాచ్‌కంటే ముందు గత ఏడాది ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఆ భీకర యుద్ధం మరోసారి గుర్తుకు వస్తోంది. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ సృష్టించిన విధ్వంసం ఐపీఎల్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

చివరిసారిగా ఈ రెండు జట్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడ్డాయి. ఆ చిన్న మైదానంలో సిక్సర్ల వర్షం కురిసింది. ఆ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 31 సిక్సర్లు బాదగా, మొత్తం 446 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఈ రెండు జట్ల మధ్య జరిగిన అత్యధిక స్కోరు మ్యాచ్ ఇదే. ఆ రోజు హైదరాబాద్ బ్యాటర్లు కోల్‌కతా బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. కేకేఆర్ జట్టును తన చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఓటమికి గురిచేసింది సన్‌రైజర్స్.

ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఏకంగా 278 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే మూడవ అత్యధిక స్కోరు. ఈ భారీ స్కోరు వెనుక సౌతాఫ్రికా వీరుడు హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం ఉంది. క్లాసెన్ కేవలం 37 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచిన క్లాసెన్, మొత్తం 39 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ఇందులో 9 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. కేకేఆర్ బౌలర్ల వద్ద క్లాసెన్ హిట్టింగ్‌కు సమాధానమే లేకపోయింది.

హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో మొత్తం 19 సిక్సర్లు నమోదయ్యాయి. క్లాసెన్ ఒక్కడే 9 సిక్సర్లు బాదగా, మిగిలిన బ్యాటర్లు కూడా తమవంతు సహకారం అందించారు. 279 పరుగుల కొండంత లక్ష్యాన్ని చూసి బెంబేలెత్తిపోయిన కోల్‌కతా నైట్ రైడర్స్.. కనీసం పోరాటం కూడా చేయలేకపోయింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో కేవలం 12 సిక్సర్లు మాత్రమే నమోదయ్యాయి. కేకేఆర్ ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా 168 పరుగులకే పరిమితమయ్యారు. దీంతో హైదరాబాద్ ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

పరుగుల పరంగా ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ఇదే అతిపెద్ద ఓటమి. ఇప్పుడు తమ సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో ఆ పాత గాయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని కోల్‌కతా భావిస్తోంది. అయితే, హైదరాబాద్ జట్టు కూడా అదే ఊపుతో ఉంది. 311 రోజుల విరామం తర్వాత జరుగుతున్న ఈ పోరులో మళ్ళీ క్లాసెన్ బ్యాట్ ఝులిపిస్తాడా లేక కేకేఆర్ బౌలర్లు అతడిని కట్టడి చేస్తారా అనేది చూడాలి. పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే ఇక్కడ కూడా పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us