ఎవర్రా సామీ నువ్వు.. 19 బంతుల్లో ఒక్క బౌండరీ కొట్టలే.. టెస్ట్ బ్యాటింగ్‌తో చిర్రెత్తించిన రూ. 23 కోట్ల ప్లేయర్

KKR vs GT: కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్, తన తుఫాన్ బ్యాటింగ్‌కు పేరుగాంచిన వెంకటేష్ అయ్యర్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఇది చూసి అంతా ఆశ్చర్యపోయారు. గుజరాత్ టైటాన్స్‌పై పరుగుల కోసం ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు.

ఎవర్రా సామీ నువ్వు.. 19 బంతుల్లో ఒక్క బౌండరీ కొట్టలే.. టెస్ట్ బ్యాటింగ్‌తో చిర్రెత్తించిన రూ. 23 కోట్ల ప్లేయర్
Venkatesh Iyer Ipl 2025

Updated on: Apr 22, 2025 | 12:04 PM

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన 39వ మ్యాచ్‌లో 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు చాలా చెత్త ఆరంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్లు రెహ్మానుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్ ఇద్దరూ పవర్ ప్లేలోనే పెవిలియన్‌ చేరారు. కేకేఆర్ ఓపెనర్లు ఇద్దరూ 43 పరుగుల వద్ద పెవిలియన్‌ చేరారు. ఆ తరువాత వెంకటేష్ అయ్యర్ మైదానంలోకి అడుగుపెట్టాడు. అయ్యర్ తన పవర్ ఫుల్ షాట్లతో మ్యాచ్‌ను గెలిపిస్తాడని అంతా ఊహించారు. కానీ ఈ మ్యాచ్‌లో టెస్ట్ ఇన్నింగ్స్ ఆడి, ఫ్యాన్స్‌తోపాటు ఫ్రాంచైజీకి విరక్తి కలిగించాడు. అతను చాలా నెమ్మదిగా ఆడటంతో కోల్‌కతా విజయానికి దూరమైంది. తన ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది.

19 బంతుల్లో 14 పరుగులు..

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ 19 బంతుల్లో 14 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. వెంకటేష్ క్రీజులోకి అడుగుపెట్టినప్పుడు, జట్టు స్కోరు 5.3 ఓవర్లలో 2 వికెట్లకు 43 పరుగులు. అతను పెవిలియన్‌కు తిరిగి వచ్చేసరికి, జట్టు స్కోరు 11.3 ఓవర్లలో 84 పరుగులు. అంటే, అతను ఔట్ అయ్యే ముందు, కెప్టెన్ అజింక్య రహానెతో కలిసి 36 బంతుల్లో కేవలం 40 పరుగుల భాగస్వామ్యాన్ని మాత్రమే చేశాడు. ఈ విధంగా కేకేఆర్‌పై పరుగుల ఒత్తిడి పెరుగుతూనే ఉంది. సాధారణంగా వెంకటేష్ అయ్యర్ వేగంగా పరుగులు చేయడంలో పేరుగాంచాడు. కానీ, గుజరాత్‌కి వ్యతిరేకంగా అతను పరుగుల కోసం ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. ఐపీఎల్ 2025 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మళ్ళీ వెంకటేష్ అయ్యర్‌ను రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ వెంకటేష్ అయ్యర్‌ను ఏకిపారేస్తున్నారు. రూ. 23.75 కోట్లు బూడిదలో పోసిన పన్నీరైందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ సీజన్‌లో వెంకటేష్ అయ్యర్ ప్రదర్శన..

ఈ సీజన్‌లో, వెంకటేష్ అయ్యర్ 8 మ్యాచ్‌లలో 6 ఇన్నింగ్స్‌లలో 22.50 సగటుతో 135 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. గత సీజన్‌లో అతను 15 మ్యాచ్‌ల్లో 46.25 సగటుతో 370 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో అతని బ్యాట్ నుంచి ఎక్కువ పరుగులు రావడం లేదు. ఇది కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఐపీఎల్ 2023లో, అతను ముంబై ఇండియన్స్‌పై 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. ఇది ఐపీఎల్‌లో అతని తొలి సెంచరీ కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..