Ranji Trophy: వార్నీ.. ఇదెక్కడి రూల్ భయ్యా.. మ్యాచ్ గెలవకుండానే సెమీ ఫైనల్ చేరిన టీం..
Kerala Reaches Ranji Trophy Semi Final: రంజీ ట్రోఫీలో జమ్మూ-కాశ్మీర్ వర్సెస్ కేరళ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ చివరి రోజున, మొదటి ఇన్నింగ్స్‌లో 1 పరుగు ఆధిక్యం కేరళకు అద్భుత వరంలా మారింది. దీంతో ఆ జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకోగలిగారు.

Kerala Reaches Ranji Trophy Semi Final: రంజీ ట్రోఫీలో నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు జరిగిన ఈ పోటీలలో 8 జట్లు పాల్గొన్నాయి. మ్యాచ్ చివరి రోజు, అంటే బుధవారం, ఫిబ్రవరి 12న, కేరళ, జమ్మూ కాశ్మీర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. నిజానికి, కేవలం 1 పరుగు కేరళ జట్టుకు వరంలా మారింది. మ్యాచ్ గెలవకుండానే సెమీ-ఫైనల్లోకి ప్రవేశించింది. చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ, జమ్మూ కాశ్మీర్ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అసలు ఇది ఎలా జరిగింది? ఈ ఉత్కంఠ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరిగిందో ఇఫ్పుడు తెలుసుకుందాం..
కేరళకు వరంగా మారిన 1 పరుగు?
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జమ్మూ కాశ్మీర్ 280 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా, కేరళ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 281 పరుగులు చేసి 1 పరుగు ఆధిక్యంలో నిలిచింది. తర్వాత జమ్మూ కాశ్మీర్ మళ్లీ బ్యాటింగ్ చేసి రెండో ఇన్నింగ్స్‌లో 399 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించే క్రమంలో కేరళ 6 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. నాలుగు రోజుల మ్యాచ్ డ్రాగా ముగిసింది. కానీ, కేరళ సెమీఫైనల్స్ చేరుకోవడానికి ఈ డ్రా సరిపోయిందన్నమాట.
రంజీ ట్రోఫీ నిబంధనల ప్రకారం, నాకౌట్ మ్యాచ్‌లో ఫలితం రాకపోతే, మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న జట్టు తదుపరి మ్యాచ్‌కు అర్హత సాధిస్తుంది. కేరళ జట్టు రంజీ ట్రోఫీలో సెమీఫైనల్‌కు చేరుకోవడం ఇది రెండోసారి మాత్రమే. అంతకుముందు 2018-19లోనూ విజయం సాధించింది. ఇప్పుడు, అది సెమీ-ఫైనల్లో గుజరాత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 17 నుంచి జరుగుతుంది.
సల్మాన్, అజారుద్దీన్ పోరాటం..
కేరళ బ్యాట్స్‌మెన్ సల్మాన్ నిజార్, మహ్మద్ అజారుద్దీన్ మ్యాచ్‌ను డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించారు. సల్మాన్ అజేయంగా 44 పరుగులు చేయగా, అజారుద్దీన్ 67 పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరూ మ్యాచ్‌ను కాపాడటానికి దాదాపు 43 ఓవర్లు బ్యాటింగ్ చేశారు. ఇందులో సల్మాన్ 162 బంతులు ఎదుర్కొన్నాడు. అజారుద్దీన్ 118 బంతులు ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 115 పరుగులు జోడించారు. ఛేజింగ్‌లో కేరళ జట్టు 180 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత 7, 8 స్థానాల్లో వచ్చిన ఇద్దరు బ్యాట్స్‌మెన్ ధైర్యంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




