
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఒక పెద్ద తలనెప్పి వదిలిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అనే పేరుపై గత కొంతకాలంగా సాగుతున్న న్యాయపోరాటానికి తెరపడింది. కేరళ హైకోర్టు ఈ విషయంలో బీసీసీఐకి అనుకూలంగా తీర్పునిస్తూ, వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో లీగ్ పేరు మార్చాల్సిన అవసరం లేదని స్పష్టమైంది. సామాజిక కార్యకర్త అని చెప్పుకునే అశిక్ కరోత్ అనే వ్యక్తి కేరళ హైకోర్టులో ఒక వింత పిటిషన్ వేశారు. బీసీసీఐ తన ప్రైవేట్ టీ20 లీగ్ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే పేరును ఉపయోగించడం చట్టవిరుద్ధమని ఆయన వాదించారు. అయితే చీఫ్ జస్టిస్ సౌమెన్ సేన్, జస్టిస్ శ్యామ్ కుమార్ వి.ఎంలతో కూడిన ధర్మాసనం ఈ వాదనను ఏమాత్రం అంగీకరించలేదు. ఐపీఎల్ అనేది దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్ అని, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడం అర్థరహితమని కోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌లో ఎలాంటి పస లేదని చెబుతూ దానిని కొట్టివేసింది.
బెంగళూరు స్టేడియానికి లైన్ క్లియర్
ఐపీఎల్ పేరు గొడవ ఒకెత్తయితే, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయా లేదా అన్నది మరో ఆందోళనగా ఉండేది. గత సీజన్‌లో ఆర్సీబీ గెలిచిన సమయంలో స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం భద్రతా పరమైన అంశాలపై సమీక్ష చేపట్టింది. హోం మంత్రి జి.పరమేశ్వర నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో స్టేడియం భద్రత, ఎక్స్‌పర్ట్ కమిటీ రిపోర్టులను పరిశీలించారు. చివరకు అదనపు భద్రతా చర్యలు తీసుకునేలా కేఎస్‌సీఏ, ఆర్సీబీ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేస్తూ మ్యాచ్‌ల నిర్వహణకు అధికారికంగా అనుమతి ఇచ్చారు.
మార్చి 28న అసలైన పండుగ
అన్ని చట్టపరమైన, భద్రతా పరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ఐపీఎల్ 19వ సీజన్ (IPL 2026) ఘనంగా ప్రారంభం కానుంది. మార్చి 28న బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన సొంత గడ్డపై మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో తలపడనుంది. ఈ సీజన్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటుండగా, తొలి దశలో 20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. మిగిలిన మ్యాచ్‌ల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
బీసీసీఐకి దక్కిన పెద్ద విజయం
ఐపీఎల్ అనేది కేవలం ఒక క్రికెట్ లీగ్ మాత్రమే కాదు, కోట్ల రూపాయల వ్యాపారం, భావోద్వేగం. ఇలాంటి సమయంలో పేరుపై వివాదం రావడం లీగ్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని బీసీసీఐ ఆందోళన చెందింది. అయితే కోర్టు తీర్పుతో బీసీసీఐ ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు బోర్డు దృష్టంతా కేవలం లీగ్‌ను దిగ్విజయంగా నిర్వహించడంపైనే ఉంది. మరోవైపు ఫ్యాన్స్ కూడా తమ అభిమాన క్రికెటర్లను మైదానంలో చూసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు ఫ్యాన్స్‌కు తమ టీమ్ మొదటి మ్యాచ్‌ను సొంత గ్రౌండ్‌లో చూడటం పెద్ద పండగే అని చెప్పాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..