Mahanaryaman Scindia: MPCA పీఠంపై సింధియా మూడో తరం.. ప్రెసిడెంట్‌గా మహానార్యమన్..!

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కొడుకు మహానార్యమన్ రావు సింధియా మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. మహానార్యమన్ ఏకైక అధ్యక్ష పదవికి ఏకైక అభ్యర్థి.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడం దాదాపు ఖాయం. సింధియా కుటుంబానికి - క్రీడలకు ఉన్న సంబంధాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Mahanaryaman Scindia: MPCA పీఠంపై సింధియా మూడో తరం.. ప్రెసిడెంట్‌గా మహానార్యమన్..!
Mahanaryaman Scindia

Updated on: Aug 31, 2025 | 9:37 AM

మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహానార్యమన్ సింధియా ఎన్నిక కావడం దాదాపుగా ఖాయమైంది. ఈ పదవికి ఆయన తప్ప మరెవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో మహానార్యమన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2న ఇండోర్‌లో జరగనున్న MPCA వార్షిక సర్వసభ్య సమావేశంలో అధికారికంగా ఈ ప్రకటన వెలువడనుంది. ఈ ఎన్నికతో సింధియా కుటుంబం నుంచి ఎంపీసీఏ అధ్యక్ష పదవిని చేపట్టే మూడవ తరం వ్యక్తిగా మహానార్యమన్ సింధియా నిలిచారు. గతంలో ఆయన తాత మాధవరావు సింధియా, తండ్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా సుదీర్ఘ కాలం పాటు ఎంపీసీఏ అధ్యక్షులుగా పనిచేసి, రాష్ట్ర క్రికెట్ పరిపాలనలో కీలక పాత్ర పోషించారు. మహానార్యమన్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లీగ్ అధ్యక్షుడిగా, గ్వాలియర్ డివిజన్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

క్రికెట్ పరిపాలనలో చురుకుగా..

28 ఏళ్ల మహానార్యమన్ రావు సింధియా గత కొంతకాలంగా క్రికెట్ పరిపాలనలో చురుకుగా ఉన్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధ్యప్రదేశ్ లీగ్‌ను ప్రారంభించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ లీగ్ రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు మంచి వేదికగా నిలిచింది.

క్రీడలు – రాజకీయాలతో అవినాభవ బంధం

సింధియా కుటుంబానికి క్రీడలు, రాజకీయాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. మాధవరావు సింధియా క్రికెట్ ఆడి ఎంపీసీఏ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో రాణించారు. ఆయన అనంతరం జ్యోతిరాదిత్య సింధియా కూడా క్రికెట్ పాలనలో కీలక పాత్ర పోషించి, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఎదిగారు. ఇప్పుడు వారి బాటలోనే మహానార్యమన్ సింధియా క్రికెట్ పరిపాలనలోకి అడుగుపెట్టారు. ఇది ఆయన భవిష్యత్ రాజకీయ ప్రస్థానానికి ఒక తొలి అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇతర కీలక పదవులు కూడా..

అధ్యక్షుడితో పాటు ఇతర కార్యవర్గ సభ్యుల ఎన్నికలు కూడా దాదాపుగా ఖరారయ్యాయి. కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి వినీత్ సేథియా, కార్యదర్శి పదవికి సుధీర్ అస్నాని, కోశాధికారి పదవికి సంజయ్ దువా ఎంపికయ్యారు. అలాగే కార్యనిర్వాహక సభ్యులుగా రాజీవ్ రిసోద్కర్, ప్రశున్ కన్మదికరణ్, విజయ్స్ రాణా, సంధ్య అగర్వాల్ పేర్లు కూడా ఖరారయ్యాయి. జాయింట్ సెక్రటరీ పదవికి మాత్రం పోటీ ఉండే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..