SRH Office Protest : లోకల్ టాలెంట్ పై కుట్ర? సన్‌రైజర్స్ తీరుపై నిప్పులు చెరుగుతున్న తెలంగాణ క్రికెట్ సంఘాలు

SRH Office Protest : సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మన సొంత టీమ్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)లో మన లోకల్ ప్లేయర్లు ఎవరూ లేకపోవడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈ క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్ ఆఫీసు వద్ద నిరసన జ్వాలలు మిన్నంటాయి.

SRH Office Protest : లోకల్ టాలెంట్ పై కుట్ర? సన్‌రైజర్స్ తీరుపై నిప్పులు చెరుగుతున్న తెలంగాణ క్రికెట్ సంఘాలు
Srh Office Protest

Updated on: Apr 04, 2026 | 8:10 AM

SRH Office Protest : ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ ఫీవర్ మామూలుగా ఉండదు. అయితే, మన సొంత టీమ్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)లో మన లోకల్ ప్లేయర్లు ఎవరూ లేకపోవడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. “హైదరాబాద్ పేరు పెట్టుకుని.. మన వాళ్లను తీసుకోరా?” అంటూ తెలంగాణ క్రికెట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని ఎస్‌ఆర్‌హెచ్ ఆఫీసు వద్ద నిరసన జ్వాలలు మిన్నంటాయి.

ఐపీఎల్ 2026 సీజన్ హోరాహోరీగా సాగుతున్న వేళ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ జిల్లాల క్రికెట్ అసోసియేషన్ (TDCA) వ్యవస్థాపక అధ్యక్షుడు, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఏ వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఎస్‌ఆర్‌హెచ్ ఆఫీసు వద్ద భారీ ధర్నా నిర్వహించారు. “హైదరాబాద్ పేరు మీద వ్యాపారం చేస్తూ, ఇక్కడి మౌలిక సదుపాయాలను వాడుకుంటూ.. మన ఊరి పిల్లలకు అవకాశం ఇవ్వకపోవడం ఏంటి?” అని ఆయన యాజమాన్యాన్ని నిలదీశారు.

వంద మంది ఉన్నా.. ఒక్కరినీ తీసుకోరా?

ఈ నిరసన సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ వేలం కోసం తెలంగాణ నుంచి దాదాపు 100 మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు రిజిస్టర్ చేసుకున్నారని, కానీ ఎస్‌ఆర్‌హెచ్ ఒక్కరిని కూడా కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. ముఖ్యంగా ఆరోన్ జార్జ్, అమన్ రావు వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని ధ్వజమెత్తారు. స్థానిక ఆటగాళ్లను ప్రోత్సహించని పక్షంలో హైదరాబాద్ పేరును వాడుకునే హక్కు జట్టుకు లేదని హెచ్చరించారు.

ఐపీఎల్ కౌన్సిల్‌తో మాట్లాడాలని డిమాండ్

నిరసనకారులు ఎస్‌ఆర్‌హెచ్ ప్రతినిధి నాగేశ్‌కు వినతిపత్రం సమర్పించారు. వెంటనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తో చర్చలు జరిపి, వేలంలో పాల్గొన్న కనీసం ఇద్దరు తెలంగాణ ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోకల్ టాలెంట్‌ను గుర్తించకపోతే భవిష్యత్తులో నిరసనలు మరింత తీవ్రం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సొమ్ము, స్టేడియం కావాలి కానీ.. ఇక్కడి ప్లేయర్లు మాత్రం వద్దంటే కుదరదని ఘాటుగా విమర్శించారు.

సోషల్ మీడియాలో మద్దతు

ఎస్‌ఆర్‌హెచ్ తీరుపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇతర రాష్ట్రాల జట్లు తమ లోకల్ ప్లేయర్లను బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చుకుంటుంటే, మన టీమ్ మాత్రం విదేశీయులు లేదా ఇతర రాష్ట్రాల ప్లేయర్లకే ప్రాధాన్యత ఇస్తుందని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. కనీసం వచ్చే సీజన్ లోనైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నామని వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నిరసనతో ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యంపై ఒత్తిడి పెరిగినట్లయింది.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us