గత ఏడాది కాలంగా స్టార్ ఆటగాళ్ల గాయాల బెడత తీవ్ర టీమిండియాకు తలనొప్పిగా మారింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేసు గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా తదితరులు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. జడేజా ఎలాగోలా తిరిగి వచ్చి అదరగొడుతుంటే, బుమ్రా పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్లు తయారైంది. గత 7 నెలలుగా ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న బుమ్రా రీఎంట్రీకి మరింత సమయం పట్టవచ్చని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీఎల్-2023 సీజన్‌తో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లోనూ అతను ఆడడం అనుమానమేనని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే టీమిండియాతో పాటు ముంబై ఇండియన్స్‌కు సమస్యలు తప్పవు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, జస్ప్రీత్ బుమ్రా మైదానంలోకి రావడానికి మరింత సమయం పట్టవచ్చు. వెన్నులో ఫ్రాక్చర్ సమస్యతో ఇబ్బంది పడుతోన్న బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదని, IPL 2023 సీజన్‌లో అతను ఆడటం కష్టమని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా గతేడాది జులైలో ఇంగ్లండ్ పర్యటన తర్వాత బుమ్రాకు ఈ వెన్నునొప్పి సమస్య వచ్చింది. దీని కారణంగా అతను ఆసియా కప్‌లో కూడా ఆడలేకపోయాడు. ఆతర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్‌లో పునరాగమనం చేసాడు. అయితే కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. మళ్లీ గాయపడడంతో T20 ప్రపంచ కప్ 2022కు దూరమయ్యాడు. ఇక ఈ ఏడాది జనవరి లో శ్రీలంకతో జరిగిన ODI సిరీస్‌కి జట్టులో చోటిచ్చారు. కానీ సిరీస్ ప్రారంభానికి ఒక రోజు ముందే తప్పుకున్నాడు. దీని తర్వాత ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని భావించారు. అయితే అది కూడా జరగలేదు. ఆతర్వాత మొత్తం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లోనూ ఆడడం లేదు. అయితే మార్చి 31 నుండి ప్రారంభమయ్యే ఐపిఎల్ 2023 సీజన్ కోసం బుమ్రా తన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో కలుస్తాడని చాలామంది ఊహించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. IPL మాత్రమే కాదు, జూన్‌లో ఇంగ్లాండ్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అతను ఆడకపోవచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ కలిసొస్తే.. అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో బుమ్రాను చూడవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..