
Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో 270 పరుగులతో తన విశ్వరూపం చూపించిన ఈస్ట్ జోన్ కెప్టెన్ ఈషాన్ కిషన్, మ్యాచ్ ముగిసిన తర్వాత బీసీసీఐ సెలెక్టర్లకు తన మాటలతో స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. తన కష్టకాలం నేర్పిన పాఠాలు, జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ పై కిషన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. భారత జట్టులో క్రమం తప్పకుండా ఆడుతున్న సమయంలో అకస్మాత్తుగా సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన నాటి చేదు అనుభవాలను ఈషాన్ కిషన్ గుర్తుచేసుకున్నాడు. కెరీర్‌లో ఎదురైన ఆ క్లిష్ట పరిస్థితులే తనకు అసలైన పాఠాలు నేర్పాయని చెప్పాడు. అనవసరంగా ఎక్కువ ఆలోచించడం, సొంతంగా భారీ అంచనాలు పెంచుకోవడం బంద్ చేశానని స్పష్టం చేశాడు. టీమిండియా నుంచి బయటకు వచ్చిన సమయంలోనే మైండ్ సెట్ ఎంత ముఖ్యమో అర్థమైందని, ఒక బ్యాటర్‌గా తన పని కేవలం రన్స్ చేయడమేనని తేల్చి చెప్పాడు. మైండ్ క్లియర్‌గా ఉంటే గ్రౌండ్‌లో పెర్ఫార్మ్ చేయడం చాలా సులభమని విశ్లేషించాడు.
సెలెక్టర్లను ఉద్దేశించి ఈషాన్ కిషన్ మాట్లాడుతూ.. తన వైపు నుంచి చేయాల్సింది చేసుకుంటూ పోవడమే తన బాధ్యత అని తెలిపాడు. “ప్రతి మ్యాచ్‌లోనూ గ్రౌండ్‌లోకి దిగి బంతికి తగ్గట్టు ఆడటమే నా పని. నాపై ఎలాంటి అదనపు ఒత్తిడి పెంచుకోను. రన్స్ చేసుకుంటూ పోవడమే నా బాధ్యత, నన్ను టీమ్‌లోకి ఎంపిక చేయడం లేదా పక్కన పెట్టడం సెలెక్టర్ల చేతుల్లోనే ఉంది” అంటూ ఇన్‌డైరెక్ట్‌గా గట్టి సందేశాన్నే పంపాడు. గతంలో రంజీ ట్రోఫీలో సెంచరీలు, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 517 రన్స్ చేసి ఝార్ఖండ్‌ను విజేతగా నిలిపిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు.
రెడ్ బాల్ క్రికెట్ ఆడటానికి ముందు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రత్యేకంగా సాధన చేసినట్లు కిషన్ వెల్లడించాడు. ఆరంభ మ్యాచ్‌ల్లో శోధించి ఆడే క్రమంలో కొన్ని తప్పులు జరిగాయని, షాట్ సెలెక్షన్ విషయంలో అయోమయానికి గురై వికెట్ సమర్పించుకున్నట్లు ఒప్పుకున్నాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌కి వచ్చేసరికి ఆ తప్పులను సరిదిద్దుకుని క్రీజులో ఎక్కువ సమయం గడపడంపైనే దృష్టి పెట్టానని చెప్పాడు. టీమ్‌లో సీనియర్ ప్లేయర్‌గా ఉన్నప్పుడు సహచరుల నుంచి ఆశించే అంచనాలను అందుకోవడం తన బాధ్యత అని వివరించాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు రెడ్ బాల్ క్రికెట్‌లోనూ ఈషాన్ చూపిస్తున్న స్థిరమైన ప్రదర్శన అతడిని మళ్లీ భారత టెస్టు జట్టుకు బలమైన పోటీదారుగా నిలబెట్టింది. కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఐదో స్థానంలో వచ్చి 270 పరుగుల సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటం సామాన్యమైన విషయం కాదు. మైదానంలో తన బ్యాట్‌తోనే కాకుండా, బయట తన వ్యాఖ్యలతోనూ సెలెక్టర్లపై ఒత్తిడి పెంచడంలో ఈషాన్ కిషన్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..