Video: మా బౌలర్లది సూపర్ బౌలింగ్! ఓటమిపై మీడియా ముందు పచ్చి నిజాలు కక్కేసిన ఇషాన్ కిషన్
ఇంగ్లండ్‌తో టీ20 ఓటమిపై ఇషాన్ కిషన్ స్పందించాడు. అదనపు పరుగులు సాధించి, బ్యాటింగ్ వేగాన్ని పెంచాలని సూచించాడు. కీలకమైన మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ నెమ్మదించిందని, నో-బాల్స్ ఫలితాన్ని ప్రభావితం చేశాయని కిషన్ అభిప్రాయపడ్డాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపిస్తూ, అతని భవిష్యత్తుకు జట్టు మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిన తర్వాత భారత వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టు ప్రదర్శనపై స్పందించాడు. అదనంగా మరో 15, 20 పరుగులు సాధించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని, బ్యాటింగ్ వేగాన్ని పెంచడంతో పాటు ఇంగ్లండ్ పరిస్థితులను మరింత బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, ఆ తర్వాత వరుసగా ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌లు, ఇంగ్లండ్‌తో రెండో టీ20లో ఓటమి చవిచూసిన భారత్, గత 4 టీ20ల్లో విజయం సాధించలేకపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 65/2తో మంచి స్థితిలో ఉన్నప్పటికీ, మధ్య ఓవర్లలో బ్యాటింగ్ పూర్తిగా స్లో అయిపోయింది. 7 నుంచి 10వ ఓవర్లలో కేవలం 32 పరుగులు మాత్రమే చేయగా, 14 నుంచి 17వ ఓవర్ల మధ్య మరో 23 పరుగులకే పరిమితమైంది. ఇదే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసిందని కిషన్ అభిప్రాయపడ్డాడు.
తమ బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారని చెబుతూనే, బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ సెట్టింగ్‌లు, ఎవరిని ఎప్పుడు ఉపయోగించాలనే విషయాల్లో కోచ్‌లు, కెప్టెన్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇక్కడి పరిస్థితులపై వారికి(ఇంగ్లాండ్) మాకంటే ఎక్కువ అవగాహన ఉందని కిషన్ తెలిపాడు. మ్యాచ్‌లో 17వ ఓవర్ కీలక మలుపుగా మారిందని కిషన్ పేర్కొన్నాడు. ఆ ఓవర్‌లో రవి బిష్ణోయ్ వేసిన రెండు నో-బాల్స్ ఇంగ్లండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్‌కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాయని చెప్పాడు. ఫ్రీ హిట్లను సద్వినియోగం చేసుకున్న బెథెల్ మూడు భారీ సిక్సర్లు బాది మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు తిప్పాడని తెలిపాడు. మొత్తం మీద భారత బౌలర్లు ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేసినప్పటికీ, బెథెల్ అద్భుత ఇన్నింగ్స్‌కు పూర్తి క్రెడిట్ ఇవ్వాల్సిందేనని కిషన్ అన్నాడు.
Ishan Kishan in the PC. pic.twitter.com/RhmcHzDWzB
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 5, 2026
వరుస ఓటములు ఆటగాళ్ల మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తాయని అంగీకరించిన కిషన్, అయినప్పటికీ జట్టులోని ప్రతి ఒక్కరూ పరిణతి చెందిన ఆటగాళ్లేనని స్పష్టం చేశాడు. తప్పులను గుర్తించి వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ మరింత బలంగా తిరిగి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇటీవల ప్రపంచ నంబర్-1 టీ20 బ్యాటర్‌గా నిలిచిన కిషన్, తన విజయ రహస్యం కూడా వివరించాడు. ఫలితాల గురించి ఆలోచించడం కంటే ప్రతిరోజూ తన ఆటను మెరుగుపరచుకోవడంపైనే దృష్టి పెడతానని, అదే తన ఫామ్‌కు కారణమైందని చెప్పాడు. ఈ సందర్భంగా భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై కూడా ప్రశంసలు కురిపించాడు. కేవలం 15 సంవత్సరాల 99 రోజుల వయసులో భారత తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించడం గొప్ప ఘనత అని పేర్కొన్నాడు. గత రెండేళ్లుగా వైభవ్ అద్భుతంగా ఆడుతున్నాడని, అతడిని సరైన దారిలో నడిపించడం సీనియర్ ఆటగాళ్ల బాధ్యత అని కిషన్ తెలిపాడు. యువ ఆటగాడిపై అనవసర ఒత్తిడి పడకుండా జట్టు మొత్తం అతనికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
