Vaibhav Suryavanshi : భారత క్రికెట్‌లో వైభవం..15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్ అయినట్లేనా ?

Vaibhav Suryavanshi : భారత క్రికెట్‌లో సరికొత్త శకం మొదలుకాబోతోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ , త్వరలో టీమిండియా బ్లూ కలర్ జెర్సీని ధరించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Vaibhav Suryavanshi : భారత క్రికెట్‌లో వైభవం..15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్ అయినట్లేనా ?
Vaibhav Suryavanshi

Updated on: Apr 14, 2026 | 12:43 PM

Vaibhav Suryavanshi : భారత క్రికెట్‌లో సరికొత్త శకం మొదలుకాబోతోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ, త్వరలో టీమిండియా నీలి రంగు జెర్సీని ధరించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. జూన్‌లో జరగబోయే ఐర్లాండ్ పర్యటన కోసం బీసీసీఐ సెలక్టర్లు పరిశీలిస్తున్న ఆటగాళ్ల జాబితాలో వైభవ్ పేరు ప్రధానంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అతడు బరిలోకి దిగితే, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న దశాబ్దాల నాటి రికార్డు కనుమరుగు కానుంది.

అరంగేట్రం ఖాయమైనట్టే

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తాజా మ్యాచ్‌లో వైభవ్ సున్నాకే అవుట్ అయినప్పటికీ, అతని టాలెంట్ పై సెలక్టర్లకు పూర్తి నమ్మకం ఉంది. జూన్ నెలలో ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని భావిస్తోంది. ఇందులో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చి, అతని సత్తాను అంతర్జాతీయ స్థాయిలో పరీక్షించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేయగా, అందులో వైభవ్ పేరు అగ్రస్థానంలో ఉంది.

సచిన్ రికార్డు బద్ధలు

ప్రస్తుతం భారత పురుషుల క్రికెట్ జట్టులో అత్యంత పిన్న వయసులో (16 ఏళ్ల 205 రోజులు) అరంగేట్రం చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. వైభవ్ వయసు ఇప్పుడు 15 ఏళ్లు మాత్రమే. ఒకవేళ ఐర్లాండ్ సిరీస్‌లో అతడు బరిలోకి దిగితే సచిన్ రికార్డును మాత్రమే కాకుండా, మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ (15 ఏళ్ల 7 నెలల 27 రోజులు) పేరిట ఉన్న ఓవరాల్ రికార్డును కూడా బద్దలు కొడతాడు. భారత క్రికెట్ చరిత్రలో 15 ఏళ్లకే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి పురుష క్రికెటర్‌గా వైభవ్ చరిత్ర సృష్టించబోతున్నాడు.

ఎందుకు ఈ సెలక్షన్?

వైభవ్ కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కాకుండా, అండర్-19 స్థాయిలో కూడా అద్భుతాలు సృష్టించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా పిచ్‌లపై అండర్-19 జట్లపై ఫాస్టెస్ట్ సెంచరీలు బాది సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ అత్యంత వేగంగా పరుగులు సాధిస్తున్నాడు. ఓ వైపు ఆరెంజ్ క్యాప్ రేసులో ఉండటం, మరోవైపు అటాకింగ్ బ్యాటింగ్‌తో టీ20 ఫార్మాట్‌కు సరైన ఆటగాడని నిరూపించుకోవడంతో సెలక్టర్లు అతనికి పెద్ద బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇర్ఫాన్ పఠాన్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాలు కూడా వైభవ్‌కు మద్దతు తెలపడం విశేషం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us