IPL 2022 Auction: ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరగనుంది. ఈ వేలంలో చాలా మంది ఆటగాళ్లు ధనవంతులు కానున్నారు. ఈసారి 590 మంది ఆటగాళ్లు వేలంలో తమ లక్‌ను చెక్ చేసుకోనున్నారు. ఇందులో 355 అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు, 228 క్యాప్డ్ ప్లేయర్‌లు ఉన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ మెగా వేలంలో 10 జట్లు పాల్గొంటాయి. అదే సమయంలో ఐపీఎల్(IPL)లో 7 అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా వేలంలో భాగం కానున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో టాప్-5 ఖరీదైన ఆటగాళ్లు(IPL Highest Paid Players) ఎవరో తెలుసుకుందాం.
5. గౌతమ్ గంభీర్ – రూ. 14.9 కోట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్) 2011
2011 ఐపీఎల్ వేలంలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రూ. 14.9 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో వేలంలో అమ్ముడైన అత్యంత ఖరీదైన ఆటగాడిగా గంభీర్ నిలిచాడు. కేకేఆర్ కోసం గంభీర్‌కి ఇదే మొదటి సీజన్. ఈ టోర్నీలో, అతను 15 మ్యాచ్‌లలో 119.24 స్ట్రైక్ రేట్, 34.36 సగటుతో మొత్తం 378 పరుగులు మాత్రమే చేశాడు. 15 ఇన్నింగ్స్‌ల్లో అతని బ్యాట్‌తో 2 అర్ధసెంచరీలు నమోదయ్యాయి. అతని కెప్టెన్సీలో కోల్‌కతా 2011 టోర్నమెంట్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఆ తర్వాత 2012, 2014లో గంభీర్ కోల్‌కతా చాంపియన్‌గా నిలిపాడు. 2022 సీజన్‌లో గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ పాత్రలో కనిపించనున్నాడు.
4. కైల్ జేమిసన్ – రూ. 15 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) 2021
2021 IPL వేలంలో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 15 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.15 కోట్ల జమీసన్‌కు టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించగా, అతను 29.89తో 9 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ సమయంలో కైల్ 9.61 ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. భారత్‌లో జరిగిన ఫేజ్-1లో వచ్చినవే కావడం గమనార్హం. ఫేజ్ 2లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఈసారి RCB అతన్ని విడుదల చేసింది. మెగా వేలం సమయంలో అతనికి మళ్లీ భారీ బిడ్ వస్తుందని భావిస్తున్నారు. జేమీసన్ 2022 సీజన్ కోసం బెంగుళూరు విడుదల చేసింది. ఈ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఈ ఏడాది వేలంలో పాల్గొనడం లేదు. టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించేందుకు జేమీసన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
3. పాట్ కమ్మిన్స్ – రూ.15.5 కోట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్) 2020
ఐపీఎల్‌లో ఖరీదైన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ఒకరు. గతేడాది జరిగిన ఐపీఎల్-13 వేలంలో కమిన్స్‌ను రూ.15.50 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే ఈ టోర్నీలో మాత్రం ప్రత్యేకంగా ఏమీ చూపించలేకపోయాడు. 14 మ్యాచుల్లో 12 వికెట్లే అతని ఖాతాలో పడ్డాయి. IPL 2021 సస్పెన్షన్‌కు ముందు, పాట్ చాలా మంచి ఫామ్‌లో కనిపించాడు. బంతితో పాటు బ్యాట్‌తోనూ తనదైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. టోర్నమెంట్ నిలిపివేసే ముందు 7 మ్యాచ్‌లలో, అతను 166 స్ట్రైక్ రేట్‌తో 93 పరుగులు చేశాడు. అదే సమయంలో బంతితో 9 వికెట్లు తీసుకున్నాడు. రూ. 2 కోట్ల బేస్ ధరతో ఐపీఎల్ మెగా వేలంలో కమిన్స్ పాల్గొంటున్నాడు.
2. యువరాజ్ సింగ్- రూ. 16 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్) 2015
సిక్సర్ కింగ్‌గా పేరుగాంచిన యువరాజ్ సింగ్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) 2015 సీజన్ కోసం అత్యధికంగా రూ. 16 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో యువీ పెద్దగా రాణించలేకపోయాడు. 14 మ్యాచుల్లో 248 పరుగులు చేసి ఒక వికెట్ తీశాడు. యువరాజ్ తన పేరుకు తగ్గట్టుగా రాణించకపోవచ్చు.. కానీ, ఐపీఎల్ వేలంలో యువరాజ్ పేరు భారత ఆటగాళ్ల జాబితాలో మొదటి, ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలిచింది. యువరాజ్ 10 జూన్ 2019 న క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.
1. క్రిస్ మోరిస్- రూ. 16.25 కోట్లు (రాజస్థాన్ రాయల్స్) 2021
ఐపీఎల్‌లో అమ్ముడైన అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ పేరు మొదటి స్థానంలో ఉంది. 2021 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. అతను టోర్నమెంట్ ఫేజ్-1లో తన ప్రదర్శనతో విమర్శకుల నోరు మూయించాడు. మొదటి దశలో అతను 7 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. అయితే, ఫేజ్ 2 సమయంలో అతని ప్రదర్శన క్షీణించింది. 4 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఈసారి రాజస్థాన్ అతన్ని విడుదల చేసింది. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో ఏ జట్టు కూడా అతని కోసం ఇంత మొత్తం వెచ్చించకపోవచ్చు. క్రిస్ మోరిస్ కూడా ఈ వేలంలో భాగం కాదు. మోరిస్ ఇటీవల అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.