IPL 2026 : ఆరుగురు కెప్టెన్లు ఒకటే తప్పు.. గెలిచామన్న ఆనందం గంట కూడా ఉండట్లేదు సామీ

IPL 2026 :ఐపీఎల్ 2026లో స్లో ఓవర్ రేట్ వల్ల అక్షర్ పటేల్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఇప్పటికే హార్దిక్, గిల్ సహా ఆరుగురు కెప్టెన్లు ఈ సీజన్‌లో జరిమానా ఎదుర్కోవడం గమనార్హం. మ్యాచ్‌లు రాత్రి 11:30 దాటినా పూర్తి కాకపోవడంతో బ్రాడ్‌కాస్టర్ల నుంచి వస్తున్న ఒత్తిడి వల్ల ఐపీఎల్ మేనేజ్‌మెంట్ జరిమానాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది.

IPL 2026 : ఆరుగురు కెప్టెన్లు ఒకటే తప్పు.. గెలిచామన్న ఆనందం గంట కూడా ఉండట్లేదు సామీ
Ipl 2026

Updated on: May 12, 2026 | 2:09 PM

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంటే, మైదానం బయట మాత్రం కెప్టెన్ల జేబులకు చిల్లులు పడుతున్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తాత్కాలిక కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ స్లో ఓవర్ రేట్ ఉచ్చులో చిక్కుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించి సంబరాల్లో ఉన్న ఢిల్లీకి, మ్యాచ్ ముగిసిన తర్వాత ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షాకిచ్చింది. నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయినందుకు అక్షర్ పటేల్‌కు రూ.12 లక్షల భారీ జరిమానా విధించింది.

ఒకే తప్పు.. ఆరుగురు కెప్టెన్లు

ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ అనేది జట్ల పాలిట పెద్ద తలనొప్పిగా మారింది. కేవలం అక్షర్ పటేల్ మాత్రమే కాదు, ఇప్పటికే ఈ జాబితాలో ఐదుగురు స్టార్ కెప్టెన్లు ఉన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గుజరాత్ టైటాన్స్ సారథి శుభ్‌మన్ గిల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ముంబై ఇండియన్స్ బాస్ హార్దిక్ పాండ్యా, అజింక్యా రహానే (స్టాండ్-ఇన్ కెప్టెన్) కూడా ఇదే తప్పు చేసి లక్షల్లో జరిమానా చెల్లించారు. అక్షర్ పటేల్ ఈ సీజన్‌లో ఈ శిక్ష అనుభవించిన ఆరో కెప్టెన్‌గా నిలిచాడు.

రూల్స్ చాలా స్ట్రిక్ట్ గురూ

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం.. ఒక సీజన్‌లో మొదటిసారి స్లో ఓవర్ రేట్ తప్పు చేస్తే కెప్టెన్‌కు రూ.12 లక్షల జరిమానా విధిస్తారు. ఇదే తప్పు రెండోసారి జరిగితే జరిమానా రూ.24 లక్షలకు పెరగడమే కాకుండా, జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు కూడా మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. ఒకవేళ మూడోసారి కూడా అదే తప్పు పునరావృతమైతే, కెప్టెన్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రతి కెప్టెన్ బౌలర్లతో ఓవర్లు వేయించేటప్పుడు గడియారం వైపు భయంతో చూడాల్సి వస్తోంది.

ఎందుకీ జాప్యం?

మ్యాచ్‌ల్లో వ్యూహాల కోసం కెప్టెన్లు బౌలర్లతో ఎక్కువసేపు చర్చలు జరపడం, ఫీల్డింగ్ మార్పుల కోసం తీసుకునే సమయం వల్ల ఈ జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బ్యాటర్లు సిక్సర్లు కొడుతుంటే, తదుపరి బంతి ఎలా వేయాలనే దానిపై జరిగే సుదీర్ఘ చర్చలు ఓవర్ రేట్‌ను దెబ్బతీస్తున్నాయి. మ్యాచ్‌లు రాత్రి 11:30 దాటినా పూర్తి కాకపోవడంతో బ్రాడ్‌కాస్టర్ల నుంచి వస్తున్న ఒత్తిడి వల్ల ఐపీఎల్ మేనేజ్‌మెంట్ జరిమానాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us