
Shubman Gill : ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన 14వ లీగ్ మ్యాచ్‌లో గిల్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. గుజరాత్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో ముకేశ్ చౌదరి వేసిన నాలుగో బంతిని ఫోర్‌గా మలిచి గిల్ తన పరుగుల ఖాతాను తెరిచాడు. ఈ ఒక్క ఫోర్‌తో అంతర్జాతీయ టి20 క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల రేస్‌లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను గిల్ వెనక్కి నెట్టేశాడు.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 2008 నుంచి 2011 మధ్య కాలంలో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన మొత్తం 55 టి20 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించి 1871 పరుగులు సాధించారు. ఇందులో ఒక అద్భుతమైన సెంచరీ (100 నాటౌట్) కూడా ఉంది. అయితే గుజరాత్ టైటాన్స్ ప్రస్తుత రథసారథి శుభ్‌మన్ గిల్ కేవలం 47 మ్యాచ్‌ల్లోనే కెప్టెన్‌గా 1874 పరుగులు పూర్తి చేసుకుని సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. కెప్టెన్‌గా గిల్ బెస్ట్ స్కోరు 104 పరుగులు కావడం గమనార్హం.
టి20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్ల జాబితాలో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ టీమిండియాతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రికార్డు స్థాయిలో 193 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా ఉండి ఏకంగా 6564 పరుగులు సాధించాడు. ఇందులో అతని బెస్ట్ స్కోరు 113 పరుగులు. ఈ లిస్ట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 331 మ్యాచ్‌ల్లో 6283 పరుగులతో రెండో స్థానంలో, ప్రస్తుత దిగ్గజం రోహిత్ శర్మ 225 మ్యాచ్‌ల్లో 6064 పరుగులతో మూడో స్థానంలో ఉంటూ ఆరు వేల పరుగుల క్లబ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
కెప్టెన్లుగా పరుగుల వరద పారించిన మిగిలిన భారత ఆటగాళ్లను పరిశీలిస్తే.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన గౌతమ్ గంభీర్ 170 మ్యాచ్‌ల్లో 4242 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నారు. అతని తర్వాత శ్రేయస్ అయ్యర్ 113 మ్యాచ్‌ల్లో 3474 పరుగులతో ఐదో స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ 105 మ్యాచ్‌ల్లో 3114 పరుగులతో ఆరో స్థానంలో నిలిచారు. అలాగే కేఎల్ రాహుల్ కేవలం 65 మ్యాచ్‌ల్లోనే కెప్టెన్‌గా 2753 పరుగులు సాధించి అత్యంత వేగంగా పరుగులు రాబడుతున్న సారథిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అజింక్య రహానే 79 మ్యాచ్‌ల్లో 1882 పరుగులతో గిల్ కంటే స్వల్ప ఆధిక్యంలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.
సచిన్ టెండూల్కర్‌ను పదో స్థానానికి నెట్టేసి తొమ్మిదో స్థానాన్ని ఆక్రమించిన శుభ్‌మన్ గిల్‌కు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు టీమిండియా, ముంబై జట్లకు కలిపి 73 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా ఉండి 1834 పరుగులు సాధించి 11వ స్థానంలో ఉన్నాడు. గిల్‌కు, సూర్యకుమార్‌కు మధ్య కేవలం 40 పరుగుల వ్యత్యాసం మాత్రమే ఉండటంతో రాబోయే మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు యువ కెప్టెన్ల మధ్య మరిన్ని రికార్డుల వేట సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
భారత బ్యాటర్లు దేశీయంగా రికార్డులు సృష్టిస్తుంటే, ప్రపంచవ్యాప్తంగా టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా ఇంగ్లండ్ క్రికెటర్ జేమ్స్ విన్స్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. 2014లో కెప్టెన్సీ కెరీర్ ప్రారంభించిన విన్స్.. హాంప్‌షైర్, గల్ఫ్ జెయింట్స్ వంటి ఐదు విభిన్న జట్లకు 236 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించి అత్యధికంగా 6917 పరుగులు చేశాడు. అతని తర్వాత సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 216 మ్యాచ్‌ల్లో 6769 పరుగులతో ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచి టి20 ఫార్మాట్‌లో బెస్ట్ కెప్టెన్లుగా తమ ముద్ర వేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..