
IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరువవుతున్న కొద్దీ పాయింట్ల పట్టికలో సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆదివారం జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్‌కు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి గెలుపు హ్యాట్రిక్ కొట్టింది. పంజాబ్‌పై గత ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నప్పటికీ, గుజరాత్ జట్టుకు పాయింట్ల పట్టికలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రయోజనం కలగలేదు. పాయింట్లు పెరిగినా రన్ రేట్ దెబ్బకొట్టడంతో ఆ జట్టు ఇంకా టాప్-4 బయటే ఉండాల్సి వచ్చింది.
గుజరాత్ టైటాన్స్ జట్టుకు లక్ కలిసి రావడం లేదనే చెప్పాలి. వరుసగా మూడు మ్యాచులు గెలిచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఐదో స్థానానికే పరిమితమైంది. ప్రస్తుతం గుజరాత్, బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ జట్లన్నీ 12 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉండటం వల్ల గుజరాత్ టాప్-4లోకి ప్రవేశించలేకపోయింది. ప్లేఆఫ్స్ చేరాలంటే గిల్ సేన మిగిలిన మ్యాచుల్లో భారీ విజయాలు సాధించి రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది.
సీజన్ ఆరంభంలో వరుసగా ఆరు విజయాలతో దూసుకుపోయిన పంజాబ్ కింగ్స్, ఇప్పుడు వరుస ఓటములతో సతమతమవుతోంది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయిన పంజాబ్, ఇప్పుడు గుజరాత్ చేతిలో కూడా దెబ్బతింది. ప్రస్తుతం 13 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉన్నప్పటికీ, వారి వెనకాలే 12 పాయింట్లతో మూడు జట్లు కాచుకుని కూర్చున్నాయి. ఒక్క మ్యాచ్ అటు ఇటు అయినా పంజాబ్ అగ్రస్థానం గల్లంతవ్వడం ఖాయం. ప్లేఆఫ్స్ టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ప్రియాంక్ శర్మ బృందం త్వరగా మళ్లీ ఫామ్‌లోకి రావాలి.
ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం.. పంజాబ్ కింగ్స్ (13 పాయింట్లు) మొదటి స్థానంలో ఉండగా, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ మూడు జట్లూ 12 పాయింట్లతోనే ఉన్నప్పటికీ రన్ రేట్ పరంగా బెంగళూరు మెరుగ్గా ఉంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో 8 పాయింట్లతో ఆరు, ఏడు స్థానాల్లో ఉండి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకున్నాయి.
ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈరోజు తన ఉనికిని కాపాడుకునే పోరాటం చేయబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగనున్న మ్యాచ్ ముంబైకి చావో రేవో లాంటిది. ఒకవేళ ఈరోజు ముంబై ఓడిపోతే అధికారికంగా ఐపీఎల్ 2026 రేసు నుంచి తప్పుకున్నట్లే. ఇప్పటికే 9 మ్యాచుల్లో కేవలం రెండు విజయాలతో 4 పాయింట్లు మాత్రమే ఉన్న ముంబైకి రన్ రేట్ కూడా దారుణంగా ఉంది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ముంబై, లక్నో చేతిలో ఓడితే ఇక లీగ్ స్టేజ్ లోనే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..