GT vs RR: ప్లేఆఫ్స్‌లో సీన్ రివర్స్.. టాస్ గెలిస్తే మ్యాచ్ చేజారినట్లే..?

Gujarat Titans vs Rajasthan Royals: సగం విజయాన్ని ఖరారు చేస్తుందనుకునే టాస్, ఈ ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో మాత్రం జట్ల కొంప ముంచుతోంది. ముల్లాన్‌పూర్ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదవుతున్న వేళ, టాస్ గెలిచిన కెప్టెన్ తీసుకునే నిర్ణయం వారి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేయనుంది. బెంగళూరుతో ఫైనల్ పోరులో తలపడే ఆ రెండో జట్టు ఏదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే!

GT vs RR: ప్లేఆఫ్స్‌లో సీన్ రివర్స్.. టాస్ గెలిస్తే మ్యాచ్ చేజారినట్లే..?
Gt Vs Rr Toss
Image Credit source: AI Image

Updated on: May 29, 2026 | 2:35 PM

Gujarat Titans vs Rajasthan Royals: ఐపీఎల్ 2026 క్లైమాక్స్ క్షణాలు క్రికెట్ అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ప్లేఆఫ్స్ ముగింపు దశకు చేరిన వేళ, ముల్లాన్‌పూర్ వేదికగా నేడు జరగబోయే క్వాలిఫయర్-2 పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ కీలక మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శన కంటే కూడా ‘టాస్’ గెలిచిన జట్టు తీసుకోబోయే నిర్ణయమే మ్యాచ్ గమనాన్ని శాసించనుండటం విశేషం.

ప్లేఆఫ్స్‌లో రివర్స్ ట్రెండ్.. టాస్ గెలిచినా తప్పని ఓటమి..!

ఈ సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లను నిశితంగా గమనిస్తే ఒక విచిత్రమైన, ఆందోళనకరమైన ట్రెండ్ కనిపిస్తోంది. టాస్ గెలిచి పిచ్ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలనుకున్న జట్లకు తీవ్ర నిరాశే ఎదురైంది. సాధారణంగా టాస్ గెలిచిన కెప్టెన్ సగం మ్యాచ్ గెలిచినట్లు భావిస్తారు. కానీ ఈసారి కథ అడ్డం తిరిగింది. మొదటి రెండు ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచిన జట్లే ఘోర పరాజయాన్ని చవిచూడటం ఇప్పుడు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను ఆలోచనలో పడేసింది.

గుజరాత్ టైటాన్స్ ఆశలు.. బెంగళూరు ధాటికి బలి..!

తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడిన గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఊహించని విధంగా బౌలింగ్ ఎంచుకుంది. ధర్మశాల మైదానం బౌలింగ్‌కు సహకరిస్తుందనే శుభ్‌మన్ గిల్ అంచనా పూర్తిగా తలకిందులైంది. బెంగళూరు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో గుజరాత్ బౌలర్లు ఏకంగా 250కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. భారీ లక్ష్య ఛేదనలో ఒత్తిడికి లోనైన టైటాన్స్ కేవలం 162 పరుగులకే కుప్పకూలి, చేతులెత్తేసింది.

సన్‌రైజర్స్ చేసిన అదే తప్పు.. రాజస్థాన్ విశ్వరూపం..!

గుజరాత్ పరాజయం నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేకపోయింది. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ సైతం మొదట బౌలింగ్ చేయడానికే మొగ్గు చూపాడు. కానీ రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌ జోడి సన్‌రైజర్స్ బౌలింగ్‌ను ముక్కలు ముక్కలు చేసింది. ముఖ్యంగా వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. దీంతో రాజస్థాన్ 244 పరుగుల భారీ స్కోరు సాధించింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ, అంతటి భారీ లక్ష్యం సృష్టించిన ఒత్తిడిని తట్టుకోలేక సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతులేగరేసింది.

ముల్లాన్‌పూర్‌లో నేటి వ్యూహం ఏంటి..?

నేడు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రెండో క్వాలిఫయర్ మ్యాచ్ కూడా ముల్లాన్‌పూర్ వేదికగానే జరగనుంది. ఇది పక్కా బ్యాటింగ్ పిచ్ అని గత మ్యాచ్‌తోనే నిరూపితమైంది. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసి 230కి పైగా పరుగులు బోర్డుపై పెడితే, చేజింగ్ చేసే జట్టుపై మానసిక ఒత్తిడి పెంచడం సులువవుతుంది. గత రెండు మ్యాచ్‌లలోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్లే భారీ విజయాలు సాధించాయి. మరి నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ పాత తప్పులనే పునరావృతం చేస్తాడా? లేక ట్రెండ్‌ను గమనించి మొదట బ్యాటింగ్ ఎంచుకుంటాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఏంటి..?

క్రికెట్ అభిమానుల్లో వర్షం ముప్పుపై కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే ముల్లాన్‌పూర్‌లో వాతావరణం ప్రశాంతంగానే ఉంది, వర్షం పడే అవకాశాలు దాదాపు లేవని సమాచారం. ఒకవేళ వరుణుడు ఆటంకం కలిగించి మ్యాచ్ పూర్తిగా రద్దయితే మాత్రం గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఎందుకంటే లీగ్ దశ పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ కంటే గుజరాత్ మెరుగైన స్థానంలో ఉండటమే దీనికి కారణం.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us