
IPL 2026 : ఐపీఎల్ 2026 లీగ్ దశ ఉత్కంఠభరితంగా ముగిసింది. ముంబై ఇండియన్స్‌పై ఘనవిజయంతో రాజస్థాన్ రాయల్స్ చివరి నాల్గవ జట్టుగా ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో కలిసి రాజస్థాన్ రాయల్స్ నాకౌట్ పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మే 26 నుంచి ప్రారంభం కానున్న ప్లేఆఫ్స్ పూర్తి షెడ్యూల్ చూద్దాం. ముంబైలోని వాంఖడే మైదానంలో ఆదివారం జరిగిన అత్యంత కీలకమైన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ప్లేఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. ఈ విజయంతో లీగ్ దశ ముగిసేసరికి మొదటి నాలుగు స్థానాలు ఖరారయ్యాయి. పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లతో పాటు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తదుపరి దశకు అర్హత సాధించాయి. రాజస్థాన్ జట్టు తన ఆఖరి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం జోఫ్రా ఆర్చర్ అద్భుత బౌలింగ్‌తో ముంబై జట్టును 175 పరుగులకే కట్టడి చేసి విజయాన్ని అందుకుంది.
రియాన్ పరాగ్ సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదటిసారి ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం విశేషం. 2022 తర్వాత మళ్లీ ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఈ జట్టు ఉంది. పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన బెంగళూరు, గుజరాత్ జట్లకు ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలు లభిస్తాయి. వీరు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో తలపడతారు. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.
ప్లేఆఫ్స్ పూర్తి షెడ్యూల్, వేదికల వివరాలు
లీగ్ నాకౌట్ మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి.
మొదటి క్వాలిఫైయర్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్): మే 26, మంగళవారం. వేదిక: ధర్మశాలలోని హెచ్‌పీసీఏ మైదానం.
ఎలిమినేటర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్): మే 27, బుధవారం. వేదిక: ముల్లాన్‌పూర్, న్యూ చండీగఢ్‌లోని మహారాజ యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ మైదానం.
రెండవ క్వాలిఫైయర్ (మొదటి క్వాలిఫైయర్‌లో ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్ విజేత): మే 29, శుక్రవారం. వేదిక: ముల్లాన్‌పూర్, న్యూ చండీగఢ్‌లోని మహారాజ యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ మైదానం.
ఐపీఎల్ 2026 ఫైనల్ (మొదటి క్వాలిఫైయర్ విజేత వర్సెస్ రెండవ క్వాలిఫైయర్ విజేత): మే 31, ఆదివారం. వేదిక: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మైదానం.
బెంగళూరు సరికొత్త చరిత్ర సృష్టిస్తుందా?
గత సీజన్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి కూడా పటిష్టంగా కనిపిస్తోంది. రజత్ పటిదార్ నాయకత్వంలోని బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి ఫైనల్ చేరి ట్రోఫీని నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చెన్నై సూపర్స్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు మాత్రమే వరుసగా రెండుసార్లు టోర్నీ విజేతలుగా నిలిచాయి. ఈసారి బెంగళూరు కనుక టైటిల్ గెలిస్తే ఆ అరుదైన మైలురాయిని అందుకున్న మూడవ జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది.