IPL 2026 Bouncer Rule : ఐపీఎల్‌లో బౌన్సర్ రూల్ ఏమిటి? ఒక్క ఓవర్‌లో ఎన్ని బౌన్సర్లు వేయవచ్చు

IPL 2026 Bouncer Rule : ఐపీఎల్ 2026లో బౌలర్లు ఒక ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేయవచ్చు. మూడవ బౌన్సర్ వేస్తే నో-బాల్‌తో పాటు ఫ్రీ-హిట్ లభిస్తుంది. ఈ నిబంధన బౌలర్లకు కలిసొచ్చే అంశం. సాధారణంగా అంతర్జాతీయ టీ20ల్లో ఒక ఓవర్‌లో కేవలం ఒక బౌన్సర్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది.

IPL 2026 Bouncer Rule : ఐపీఎల్‌లో బౌన్సర్ రూల్ ఏమిటి? ఒక్క ఓవర్‌లో ఎన్ని బౌన్సర్లు వేయవచ్చు
Ipl 2026 Bouncer Rule

Updated on: Apr 09, 2026 | 9:31 AM

IPL 2026 Bouncer Rule : ఐపీఎల్ అంటేనే బ్యాటర్ల రాజ్యమని అందరికీ తెలిసిందే. భారీ సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లను ఉతికి ఆరేస్తుంటే.. పాపం బౌలర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. అయితే బ్యాటర్లకు కళ్లెం వేసేందుకు, బౌలర్లకు కాస్త ఊరటనిచ్చేందుకు బీసీసీఐ కొన్ని కీలక నిబంధనలను అమలు చేస్తోంది. అందులో ముఖ్యమైనది బౌన్సర్ రూల్. ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా ఈ నియమం బౌలర్లకు ప్రధాన ఆయుధంగా మారింది. అసలు ఐపీఎల్‌లో ఒక ఓవర్‌లో ఎన్ని బౌన్సర్లు వేయొచ్చు? రూల్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

ఓవర్‌లో ఎన్ని బౌన్సర్లు వేయవచ్చు?

క్రికెట్ చరిత్రలో టీ20 ఫార్మాట్ ఎప్పుడూ బ్యాటర్లకే అనుకూలంగా ఉంటుంది. కానీ ఐపీఎల్ 2024 సీజన్ నుంచి బీసీసీఐ ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. అదే టూ బౌన్సర్ రూల్. సాధారణంగా అంతర్జాతీయ టీ20ల్లో ఒక ఓవర్‌లో కేవలం ఒక బౌన్సర్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ఐపీఎల్‌లో మాత్రం బౌలర్లు ఒక ఓవర్‌లో రెండు బౌన్సర్లను వేయవచ్చు. ఈ నియమం 2026 సీజన్‌లో కూడా కొనసాగుతోంది, ఇది బౌలర్లకు బ్యాటర్లను కట్టడి చేసేందుకు గొప్ప అవకాశాన్ని ఇస్తోంది.

పరిమితి మించితే నో-బాల్‌తో పాటు ఫ్రీ-హిట్

ఒకవేళ బౌలర్ పొరపాటున లేదా కావాలని ఒకే ఓవర్‌లో రెండు కంటే ఎక్కువ బౌన్సర్లు (మూడవ బౌన్సర్) వేస్తే, అంపైర్ దానిని వెంటనే నో-బాల్‌గా ప్రకటిస్తారు. దీనివల్ల బ్యాటింగ్ టీమ్‌కు అదనంగా ఒక పరుగు రావడమే కాకుండా, తదుపరి బంతికి ఫ్రీ-హిట్ లభిస్తుంది. ప్రస్తుత క్రికెట్ నిబంధనల ప్రకారం.. ఏ రకమైన నో బాల్‌కైనా ఫ్రీ హిట్ ఇవ్వడం తప్పనిసరి. కాబట్టి బౌలర్లు తమ కోటా బౌన్సర్లను ఉపయోగించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో పరిస్థితి ఏంటి?

ఐపీఎల్‌లో రెండు బౌన్సర్లకు అనుమతి ఉన్నప్పటికీ, అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటికీ ఒకే బౌన్సర్ రూల్ అమల్లో ఉంది. అయితే టెస్ట్ క్రికెట్, వన్డేల్లో మాత్రం ఐపీఎల్ తరహాలోనే ఒక ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేసే వీలుంది. ఐపీఎల్‌లో ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, భవిష్యత్తులో అంతర్జాతీయ టీ20ల్లో కూడా రెండు బౌన్సర్ల నిబంధనను తీసుకువచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

బౌలర్లకు కలిగే ప్రయోజనం

ఈ రెండు బౌన్సర్ల నియమం వల్ల బ్యాటర్లు బౌలర్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. బౌలర్లు తమ అస్త్రశస్త్రాలను మరింత సమర్థవంతంగా వాడుతున్నారు. ముఖ్యంగా స్లోయర్ బౌన్సర్లను వేసి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తున్నారు. ఈ సీజన్‌లో కూడా బౌలర్లు ఈ నిబంధనను ఆయుధంగా మలచుకుని వికెట్లు పడగొడుతున్నారు. దీనివల్ల ఆటలో బ్యాలెన్స్ ఏర్పడి, కేవలం ఫోర్లు, సిక్సర్లే కాకుండా క్వాలిటీ బౌలింగ్‌ను కూడా ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us