Telugu News Sports News Cricket news IPL 2023: Virat Kohli replicates MS Dhoni in RCB vs MI Match as India celebrates 12th Anniversary of World Cup 2011
IPL 2023: ‘వరల్డ్‌కప్ ధోని’ని గుర్తు చేసిన కింగ్ కోహ్లీ.. విన్నింగ్ సిక్సర్‌తో మెరుపు ఇన్నింగ్స్..
కోహ్లి సిక్సర్ బాది ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విజయాన్ని అందించాడు. ప్రపంచ కప్ 2011 ఫైనల్ మ్యాచ్‌లో కూడా ధోని విజయం కోసం ఆఖరి షాట్‌ని సిక్సర్‌గా మలిచాడు. ఈ రెండు మ్యాచ్‌లు కూడా సరిగ్గా 11 సంవత్సరాల తేడాతో..
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా జరిగిన 5వ మ్యాచ్‌లో ముంబైపై ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. ఈ క్రమంలో 17వ ఓవర్ రెండో బంతికి క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ.. ఒక్క షాట్‌తో అందరికీ 12 ఏళ్ల నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చాడు. అవును, కోహ్లి సిక్సర్ బాది ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్ ఏప్రిల్ 2, 2023లో జరిగింది. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం అంటే ఏప్రిల్ 2, 2011న ధోని సారథ్యంలోని టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకుంది. ఆ మ్యాచ్‌లో కూడా ధోని విజయం కోసం ఆఖరి షాట్‌ని సిక్సర్‌గా మలిచాడు. ఈ రెండు మ్యాచ్‌లు కూడా సరిగ్గా 11 సంవత్సరాల తేడాతో ఒకే తేదీన జరగడంతో టీమిండియా అభిమానులు ‘ధోనికి కోహ్లీ ట్రిబ్యూట్’గా పేర్కొంటున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లీ అజేయంగా 82 పరుగులు చేసి, ఐపీఎల్ 16 సీజన్‌ని విజయంతో ప్రారంభించాడు.
— Royal Challengers Bangalore (@RCBTweets) April 2, 2023
వరల్డ్ కప్ 2011, భారత్ vs శ్రీలంక
ధోని సారథ్యంలోని టీమిండియా భారత్ వేదికగా 2011 ప్రపంచకప్ ట్రోఫీ గెలుచుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫైనల్‌కు చేరిన భారత్, శ్రీలంక జట్లు ట్రోఫీ కోసం తలపడ్డాయి. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఇక లంకన్స్ తరఫున మహేలా జయవర్ధనే అజేయమైన సెంచరీ(103)తో చెలరేగాడు. అలాగే భారత్ తరఫున యువరాజ్ 2, జహీర్ ఖాన్ 2, హర్భజన్ సింగ్ 1 వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం లభించకపోయినా వన్ డౌన్‌లో వచ్చిన గౌతమ్ గంభీర్ 97 పరుగులు చేశాడు. ఇంకా విరాట్ కోహ్లీ కూడా 35 పరుగులతో రాణించాడు. ముఖ్యంగా టీమిండియా సారథి ఎంఎస్ ధోని కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో ధోని అజేయంగా 91 పరుగులు చేశాడు. ఇక విజయం కోసం ధోని బాదిన విన్నింగ్ సిక్సర్ షాట్ టీమిండియా అభిమానుల హృదయాల్లో ఎన్నటికీ గుర్తుండిపోయేదని చెప్పుకోవాలి.
బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేశారు. ఈ క్రమంలో ముంబై తరఫున తిలక్ వర్మ అజేయంగా 84 పరుగులు(46 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన ఆర్‌సీబీకి కెప్టెన్ డూప్లసీస్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ శుభారంభం అందించడంతో.. ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయి 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అజేయంగా 82( 6 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులు చేసి అభిమానులను అలరించాడు. అచ్చం ప్రపంచకప్‌లో ధోని చేసినట్లుగానే కోహ్లీ కూడా సరిగ్గా 11 సంవత్సరాల తర్వాత అదే షాట్ కొట్టి జట్టుకు విజయం అందించాడు.