ఎంఎస్ ధోనీ తర్వాత సీఎస్కే కెప్టెన్ ఎవరు కాబోతున్నారన్న అంశంపై క్రీడా వర్గాల్లో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు ఈ విషయంపై సీఎస్కే యాజమాన్యం దాదాపుగా క్లారిటీ ఇచ్చేసింది. సీఎస్కే సమర్పించిన రీటెన్షన్ ఆటగాళ్ల జాబితాలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను మొదటి ప్రాధాన్య ఆటగాడిగా పేర్కొన్న సీఎస్కే యాజమాన్యం.. కెప్టెన్ ఎంఎస్ ధోనీని రెండో ప్రాధాన్య ఆటగాడిగా పేర్కొంది. రవీంద్ర జడేజాను రూ.16 కోట్లకు రీటైన్ చేసుకోగా.. ధోనీని రూ.12 కోట్లకు రీటైన్ చేసుకుంది. రవీంద్ర జడేజాను మొదటి ప్రాధాన్య ఆటగాడిగా ఎంచుకోవడం ద్వారా ధోనీ తర్వాత తమ జట్టు కెప్టెన్ ఎవరో సీఎస్కే యాజమాన్యం చెప్పకనే చెప్పేసింది.
అటు ధోనీ తర్వాత సీఎస్కే కెప్టెన్ ఎవరన్న అంశంపై టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రవీంద్ర జడేజా సత్తా ఏంటో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీకి బాగా తెలుసని వ్యాఖ్యానించాడు. అందుకే ధోనీ తన రిటైర్మెంట్ తర్వాత సీఎస్కే సారథ్య పగ్గాలను రవీంద్ర జడేజాకు అప్పగిస్తాడని భావిస్తున్నట్లు తెలిపాడు. రవీంద్ర జడేజా తన తర్వాత సీఎస్కే కెప్టెన్ అయ్యేందుకు మార్గం సుగమం చేసేందుకే తాను రెండో ప్రాధాన్య ఆటగాడిగా కొనసాగాలని ధోనీ నిర్ణయించుకున్నట్లు అభిప్రాయపడ్డాడు.
అటు మరో మాజీ క్రికెటర్ పార్థీవ్ పటేల్ కూడా.. సీఎస్కే జట్టుకు తదుపరి కెప్టెన్ అయ్యే సత్తా జడేజాలో ఉన్నాయని పేర్కొన్నాడు. రవీంద్ర జడేజా గొప్ప ఆటగాడని కితాబిచ్చాడు. టెస్ట్‌లో రాణిస్తున్నాడని.. వన్డేల్లోనూ ఆరో స్థానంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడని గుర్తుచేశారు. అందుకే ధోనీ తర్వాత కెప్టెన్‌గా జడేజానే సరైన వ్యక్తిగా పేర్కొన్నాడు.
Also Read..
IPL 2022: అతను వేలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.. అందుకే అతడిని రిటైన్ చేసుకోలేదు..
Unstoppable with NBK : బాలయ్య ఈసారి సందడి చేసేది బ్రహ్మానందంతోనే.. బ్రహ్మీతోపాటు ఆయన కూడా..