
Huge Rule Change In Cricket: క్రికెట్ అభిమానులకు, ఆటగాళ్లకు ఓ షాకింగ్ న్యూస్ రాబోతోంది. క్రికెట్ నిబంధనల్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) ఒక భారీ మార్పును తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఇకపై బౌండరీ లైన్ వద్ద చేసే ‘బన్నీ హాప్స్’ క్యాచ్‌ల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధన త్వరలో ఐసీసీ మాన్యువల్‌లో చేర్చనున్నట్లు తెలుస్తోంది.
ఏమిటి ఈ ‘బన్నీ హాప్స్’ క్యాచ్?
సాధారణంగా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్‌లు బంతిని అందుకునే క్రమంలో బౌండరీ వెలుపలికి వెళ్లి గాల్లోకి ఎగిరి బంతిని లోపలికి విసిరి, తిరిగి లోపలికి వచ్చి క్యాచ్‌ను పూర్తి చేస్తుంటారు. ఈ తరహా క్యాచ్‌లను ‘బన్నీ హాప్స్’ అని వ్యవహరిస్తారు. గతంలో మైఖేల్ నేసర్ బిగ్ బాష్ లీగ్‌లో, డెవాల్డ్ బ్రెవిస్ ఐపీఎల్‌లో పట్టిన క్యాచ్‌లు ఈ కోవకే చెందుతాయి. ఇవి క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించినప్పటికీ, కొందరి దృష్టిలో ఇవి ‘అన్యాయమైన’ క్యాచ్‌లుగా పరిగణించబడుతున్నాయి.
కొత్త నిబంధన ఏమి చెబుతుంది?
కొత్త నిబంధన ప్రకారం, ఫీల్డర్ బౌండరీ వెలుపల నుంచి బంతిని మొదటిసారి తాకినప్పుడు, ఆ క్యాచ్ చెల్లాలంటే ఆ ఫీల్డర్ తప్పనిసరిగా మైదానం లోపల ల్యాండ్ అవ్వాలి. అంటే, బౌండరీ వెలుపల బంతిని అనేకసార్లు గాల్లోకి ఎగురవేయడం ఇకపై కుదరదు. ఒకవేళ బంతిని బౌండరీ లోపల నుంచి పైకి నెట్టి, బయటికి వెళ్లి, ఆపై తిరిగి డైవ్ చేసి క్యాచ్ పట్టేందుకు మాత్రం అనుమతి ఉంటుంది. కానీ, బౌండరీ వెలుపల నుంచి గాల్లోకి ఎగిరి బంతిని తాకడానికి ఫీల్డర్‌కు ఒకే ఒక్క అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ బౌండరీ లైన్ దాటి వెళ్లకూడదు.
ఎందుకు ఈ మార్పు?
The MCC has changed the law to make catches like this ‘bunny hop’ one from Michael Neser illegal. In short:
If the fielder’s first touch takes them outside the boundary, their *second* touch must take them back inside the field of play.
Basically, you’re no longer allowed to… pic.twitter.com/1jaqAev0hy
— 7Cricket (@7Cricket) June 14, 2025
క్రికెట్‌లో కొన్ని క్యాచ్‌లకు సంబంధించి అన్యాయం జరుగుతోందని పలువురి నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే MCC ఈ నిర్ణయం తీసుకుంది. ఆటలో సమతౌల్యాన్ని, న్యాయాన్ని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ మార్పును తీసుకొచ్చారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ల అసాధారణ విన్యాసాలు ఆటను మరింత ఆసక్తికరంగా మార్చినప్పటికీ, నియమాల సరళత, ఆట స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎప్పటి నుంచి అమలు?
ఈ కొత్త నిబంధనలను ICC ఈ నెల నుంచే తన ‘ప్లేయింగ్ కండిషన్స్’లో భాగంగా అమలు చేయనుంది. అలాగే, MCC వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి ఈ నియమాలను అమలులోకి తీసుకురానుంది. ఈ మార్పుల వల్ల భవిష్యత్తులో ఆట తీరు ఎలా మారుతుందో, ఫీల్డర్‌లు తమ నైపుణ్యాలను ఎలా మలుచుకుంటారో వేచి చూడాలి. ఏదేమైనా, క్రికెట్ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన మార్పుగా నిలిచిపోతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..