T20I Captaincy : విరాట్ కోహ్లీ, ధోనీలకు దక్కని చోటు.. భారత టీ20 చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్లు వీళ్లే

T20I Captaincy : ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలిపి, ఢిల్లీ, పంజాబ్ జట్లను ఫైనల్స్ చేర్చిన ఘనత అయ్యర్‌కు ఉంది. ఇప్పుడు అతను టీమిండియా బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో, కనీసం 10 మ్యాచ్‌ల కంటే ఎక్కువ కెప్టెన్సీ చేసిన వారిలో అత్యుత్తమ విన్ పర్సంటేజ్ ఉన్న టాప్ 3 భారత కెప్టెన్లు ఎవరో చూద్దాం.

T20I Captaincy : విరాట్ కోహ్లీ, ధోనీలకు దక్కని చోటు.. భారత టీ20 చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్లు వీళ్లే
T20i Captaincy

Updated on: Jun 04, 2026 | 4:29 PM

T20I Captaincy : బీసీసీఐ టీ20 ఫార్మాట్‌లో మరోసారి పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమించనున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, అతను ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానాన్ని భర్తీ చేస్తాడు. ఇటీవలే సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్ 2026 టీ20 వరల్డ్ కప్ సాధించి, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల సరసన నిలిచాడు. అయినప్పటికీ కెప్టెన్సీ మార్పులు జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలిపి, ఢిల్లీ, పంజాబ్ జట్లను ఫైనల్స్ చేర్చిన ఘనత అయ్యర్‌కు ఉంది. ఇప్పుడు అతను టీమిండియా బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో, కనీసం 10 మ్యాచ్‌ల కంటే ఎక్కువ కెప్టెన్సీ చేసిన వారిలో అత్యుత్తమ విన్ పర్సంటేజ్ ఉన్న టాప్ 3 భారత కెప్టెన్లు ఎవరో చూద్దాం.

మూడో స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా

ఈ జాబితాలో మూడో స్థానాన్ని స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సొంతం చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా భారత జట్టుకు పూర్తిస్థాయి అధికారిక కెప్టెన్‌గా ఎప్పుడూ నియామకం కాలేదు. సీనియర్ల గైర్హాజరీలో పలుమార్లు జట్టును ముందుండి నడిపించాడు. అతను మొత్తం 16 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేయగా, అందులో భారత్ 10 మ్యాచ్‌ల్లో ఘనవిజయం సాధించింది. కేవలం 5 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి చవిచూసింది. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఓటమి తర్వాత అతనిని కెప్టెన్సీ గ్రూప్ నుంచి తొలగించినప్పటికీ, 62.5 విన్ పర్సంటేజ్‌తో హార్దిక్ ఈ ప్రతిష్టాత్మక లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచాడు.

రెండో స్థానంలో వరల్డ్ కప్ విన్నర్ సూర్యకుమార్ యాదవ్

రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయిన తర్వాత భారత టీ20 పగ్గాలను అందుకున్న సూర్యకుమార్ యాదవ్ ఈ లిస్ట్‌లో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. అతను మొత్తం 52 టీ20 మ్యాచ్‌లలో జట్టును నడిపించగా, భారత్ ఏకంగా 40 మ్యాచ్‌ల్లో విజయకేతనం ఎగురవేసింది. కేవలం 8 మ్యాచ్‌ల్లో మాత్రమే పరాజయం పాలైంది. కెప్టెన్‌గా సూర్యకుమార్ 2026 టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను కూడా ముద్దాడాడు. మొత్తం మీద 76.92 సాలిడ్ విన్ పర్సంటేజ్‌తో సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ను అత్యంత విజయవంతంగా ముగించాడు.

మొదటి స్థానంలో రికార్డుల రారాజు రోహిత్ శర్మ

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన టీ20 కెప్టెన్‌గా లెజెండరీ ఓపెనర్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్, భారత్‌ను 2022 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు మరియు 2024 లో గ్లోరియస్ వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిపాడు. రోహిత్ శర్మ మొత్తం 62 టీ20 మ్యాచ్‌లలో భారత జట్టుకు నాయకత్వం వహించగా, అందులో అత్యధికంగా 49 విజయాలను అందించాడు. దీంతో అతడి విన్ పర్సంటేజ్ ఏకంగా 79.03 శాతంగా నమోదైంది. టెక్నికల్‎గా రోహితే భారత్‌కు అత్యుత్తమ టీ20 కెప్టెన్.

ధోనీ, కోహ్లీలకు దక్కని టాప్-3 స్థానాలు

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారత జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్‌గా ఉండి తొలి టీ20 వరల్డ్ కప్ అందించిన ఎంఎస్ ధోనీ, అలాగే రన్ మెషిన్ విరాట్ కోహ్లీలకు ఈ టాప్ 3 విన్ పర్సంటేజ్ జాబితాలో చోటు దక్కలేదు. ఎంఎస్ ధోనీ మొత్తం 72 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసి 56.94 విన్ పర్సంటేజ్ కలిగి ఉండగా, విరాట్ కోహ్లీ 50 మ్యాచ్‌లలో జట్టును నడిపించి 60 శాతం విన్నింగ్ రేట్‌ను నమోదు చేశాడు. వీరిద్దరి కంటే హార్దిక్, సూర్యకుమార్, రోహిత్ శర్మలు మెరుగైన గెలుపు శాతాన్ని కలిగి ఉండటం విశేషం. ఇప్పుడు ఈ భారీ రికార్డుల మధ్య పగ్గాలు చేపట్టబోతున్న శ్రేయస్ అయ్యర్ భారత జట్టును ఎలాంటి శిఖరాలకు తీసుకెళ్తాడో చూడాలి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us