Sri Charani: సీఎం చంద్రబాబును కలిసిన ఛాంపియన్ ప్లేయర్.. కడప ముద్దుబిడ్డపై ప్రశంసల వర్షం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీచరణిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారు. ముఖ్యంగా, కడప జిల్లాకు చెందిన శ్రీచరణి తన అద్భుతమైన ప్రదర్శనతో మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారు" అని కొనియాడారు. మంత్రి లోకేశ్ కూడా శ్రీచరణికి శుభాకాంక్షలు తెలిపారు.

భారత మహిళల క్రికెట్ జట్టు ఇటీవల గెలుచుకున్న ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 విజేతల్లో కీలక సభ్యురాలైన ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ శ్రీచరణి (N. Sri Charani), భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj) ఈరోజు (శుక్రవారం) ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన ఈ ఇద్దరు క్రికెటర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి శ్రీ నారా లోకేశ్ ఘన స్వాగతం పలికారు.
సీఎం ప్రశంసలు: మహిళా క్రీడాకారులకు శ్రీచరణి ఆదర్శం..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీచరణిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారు. ముఖ్యంగా, కడప జిల్లాకు చెందిన శ్రీచరణి తన అద్భుతమైన ప్రదర్శనతో మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారు” అని కొనియాడారు. మంత్రి లోకేశ్ కూడా శ్రీచరణికి శుభాకాంక్షలు తెలిపారు.
వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను శ్రీచరణి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో పంచుకున్నారు.
గన్నవరం నుంచి స్వాగతం..
ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన తరువాత సొంత రాష్ట్రానికి వచ్చిన శ్రీచరణికి గన్నవరం విమానాశ్రయంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, పలువురు మంత్రులు, శాప్ (SAAP) ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఎంపీలు, మంత్రులు, ఏసీఏ ప్రతినిధులతో కలిసి శ్రీచరణి, మిథాలీ రాజ్ నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.
సీఎం భేటీ నేపథ్యంలో ముందుగా అనుకున్న విజయోత్సవ ర్యాలీని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఏసీఏ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత, శ్రీచరణి మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంను సందర్శించి, ఆ తర్వాత సొంత జిల్లా కడపకు వెళ్లనున్నారు. అక్కడ ఆమెకు ఘన సన్మానం, భారీ ర్యాలీ నిర్వహించడానికి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది.




